Mansukh Mandaviya: పదేళ్లలో ఉపాధి శాతం పెరిగింది..దశాబ్దకాలంలో ఎన్డీయే ప్రభుత్వం 17.19 కోట్ల ఉద్యోగాలు: మన్‌సుఖ్ మాండవీయ
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో ఉపాధి శాతం గణనీయంగా పెరిగిందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ పేర్కొన్నారు.
యూపీఏ హయాం కాలంతో పోల్చితే ఎన్డీయే ప్రభుత్వం గత పదేళ్లలో ఐదు రెట్లు ఎక్కువ ఉద్యోగాలను కల్పించిందని తెలిపారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)గణాంకాలను ఉటంకిస్తూ ఉపాధి కల్పనకు సంబంధించిన గణాంకాలను వివరించారు.
2014-15లో 47.15కోట్ల మంది ఉద్యోగులు ఉన్నప్పటికీ, 2023-24 నాటికి 36 శాతం పెరుగుదలతో 64.33 కోట్లకు చేరిందని తెలిపారు.
2004-2014 మధ్యకాలంలో ఉపాధి కల్పన కేవలం 7 శాతం మాత్రమే పెరిగిందని,ఆ కాలంలో యూపీఏ ప్రభుత్వం 2.9కోట్ల ఉద్యోగాలను సృష్టించగా,గత పదేళ్లలో ఎన్డీయే ప్రభుత్వం మొత్తం 17.19 కోట్ల ఉద్యోగాలను కల్పించిందని వెల్లడించారు.
వివరాలు
3.2 శాతానికి తగ్గిన నిరుద్యోగిత రేటు
అంతేకాకుండా,2023-24ఆర్థిక సంవత్సరంలో ఒక్కదానిలోనే 4.6కోట్ల మందికి ఉపాధి లభించిందని పేర్కొన్నారు.
వ్యవసాయ రంగం విషయానికి వస్తే,యూపీఏ హయాంలో ఉపాధి కల్పనలో 16శాతం క్షీణత కనిపించగా,2014-2023 మధ్యకాలంలో ఇది 19శాతం వృద్ధిని సాధించిందని తెలిపారు.
అలాగే తయారీ రంగంలో 2014-2023 మధ్య 15శాతం వృద్ధి చెందగా,యూపీఏ హయాంలో ఇది కేవలం 6 శాతం మాత్రమే ఉన్నదని వివరించారు.
సేవా రంగంలో 2004-2014 మధ్య 25శాతం వృద్ధి కనిపించగా,2014-2023 నాటికి ఇది 36శాతానికి చేరిందని తెలిపారు.
నిరుద్యోగిత రేటు 2017-18మధ్య 6శాతంగా ఉండగా,2023-24 నాటికి ఇది 3.2 శాతానికి తగ్గిందని చెప్పారు.
ఉద్యోగ కల్పన రేటు 46.8శాతం నుంచి 58.2శాతానికి పెరిగిందని,కార్మిక శక్తి భాగస్వామ్య రేటు(LFPR) 49.8శాతం నుంచి 60.1శాతానికి పెరిగిందని మన్‌సుఖ్ మాండవీయ వివరించారు.