Page Loader
Options Trading: ఎఫ్‌ అండ్‌ ఓ హెచ్చరికల తర్వాత కూడా.. ఆప్షన్స్‌ ట్రేడింగ్‌లో చిన్న మదుపర్ల జోరు
ఎఫ్‌ అండ్‌ ఓ హెచ్చరికల తర్వాత కూడా.. ఆప్షన్స్‌ ట్రేడింగ్‌లో చిన్న మదుపర్ల జోరు

Options Trading: ఎఫ్‌ అండ్‌ ఓ హెచ్చరికల తర్వాత కూడా.. ఆప్షన్స్‌ ట్రేడింగ్‌లో చిన్న మదుపర్ల జోరు

వ్రాసిన వారు Jayachandra Akuri
May 12, 2025
09:14 am

ఈ వార్తాకథనం ఏంటి

ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ (ఎఫ్‌ అండ్‌ ఓ) మార్కెట్లో ట్రేడింగ్‌ చేస్తున్న ప్రతి 10 మంది మదుపర్లలో తొమ్మిది మంది (90%) నష్టాలు చవిచూస్తున్నారని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ (SEBI) గతంలోనే గుర్తించింది. ముఖ్యంగా చిన్న మదుపర్లు తీవ్రంగా నష్టపోతున్న కారణంగా, వారిని ఈ రిస్క్‌ గల వ్యాపార రూపంలో పాల్గొనకుండా చేయడానికి 2024 నవంబరులో కొన్ని నియంత్రణ చర్యలు తీసుకుంది. అయినప్పటికీ, చిన్న మదుపర్లు డెరివేటివ్స్‌లోని ఇండెక్స్‌ ఆప్షన్ల ట్రేడింగ్‌లో భారీగా కొనసాగుతున్నారని తాజాగా సెబీ గుర్తించింది. దీంతో వారిని రక్షించేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాలని యోచనలో పడింది. 2024 డిసెంబరు నుంచి 2025 మార్చి వరకు ఇండెక్స్‌ ఆప్షన్స్‌ ట్రేడింగ్‌ సంబంధిత గణాంకాలను సెబీ అధ్యయనం చేసింది.

Details

ట్రేడింగ్ కార్యకలాపాలు అధికం

వార్షిక ప్రాతిపదికన ట్రేడింగ్‌ పరిమాణం కొంత మేర తగ్గినా, రెండు సంవత్సరాల క్రితం ఇదే కాలంతో పోలిస్తే ట్రేడింగ్‌ కార్యకలాపాలు ఇంకా అధికంగానే ఉన్నాయని స్పష్టం చేసింది. ఈ నాలుగు నెలల కాలంలో, ఈక్విటీ డెరివేటివ్స్‌ విభాగంలో ట్రేడింగ్‌ చేసే వ్యక్తుల సంఖ్య ఏడాది ప్రాతిపదికన 12 శాతం తగ్గింది. అయితే, 2022 డిసెంబరు నుంచి 2023 మార్చి మధ్యకాలంతో పోలిస్తే ఇది 77 శాతం పెరిగినదే. ఇండెక్స్‌ ఆప్షన్ల ఎక్స్‌పైరీ రోజుల్లో స్పెక్యులేషన్‌ ఎక్కువగా ఉండటం వల్ల వ్యక్తుల ట్రేడింగ్‌ స్థాయులు పెరిగాయి.

Details

సెబీ త్వరలో కొత్త చర్యలకు శ్రీకారం చుట్టే అవకాశం

వార్షికంగా చూస్తే, వ్యక్తుల ట్రేడింగ్‌ పరిమాణం ప్రీమియం పరంగా 5 శాతం, నోషనల్‌ పరంగా 16 శాతం తగ్గినప్పటికీ, రెండేళ్ల క్రితం కాలంతో పోలిస్తే ఇవి వరుసగా 34 శాతం, 99 శాతం పెరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. చిన్న మదుపర్ల పెట్టుబడులను రిస్క్‌ నుండి రక్షించేందుకు, మార్కెట్లలో స్థిరత్వాన్ని కొనసాగించేందుకు ఇండెక్స్‌ ఆప్షన్లలో వారి ట్రేడింగ్‌ కార్యకలాపాలను మరింత తగ్గించాలన్న దృక్పథంతో సెబీ త్వరలో కొత్త చర్యలకు శ్రీకారం చుట్టే అవకాశముందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.