ఎస్‌బీఐ చైర్మన్ జీతం తెలిస్తే షాక్.. వెల్లడించిన మాజీ సారథి రజనీష్ కుమార్
భారతదేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మరి అలాంటి బ్యాంక్ సారథి అంటే అందరి కళ్లు అతని జీతం మీదే ఉంటుంది. అయితే తనకు లభించిన వేతనం ఎంతో ఇటీవలే బహిర్గతం చేశారు మాజీ ఛైర్మన్ రజనీష్ కుమార్. కొత్తగా ఐఐటీ, ఐఐఎం నుంచి పాస్ అవుట్ అయిన విద్యార్థులకే తక్కువలో తక్కువ కోటి రూపాయలకుపైనే ప్యాకేజీ అందిస్తున్నారు. అలాంటిది కోట్లాది మంది ఖాతాదారులున్న స్టేట్ బ్యాంక్ లాంటి దిగ్గజ బ్యాంకుకు ఛైర్మన్ అంటే కోట్లాది రూపాయలను వేతనంగా పొందుతారని అందరూ భావిస్తారు. కానీ ఛైర్మన్ జీతం ఎంతో తెలిస్తే షాకింగ్ కలగకమానదు. ఈ మేరకు సంవత్సరానికి తన జీతం రూ.28 లక్షలు అని ఆయన చెప్పుకొచ్చారు.
స్టేట్ బ్యాంక్ ఛైర్మన్ కోసం మలబార్ హిల్స్‌లో విలాసవంతమైన బంగ్లా
రాజ్‌షామణి అనే యూట్యూబ్ ఛానెల్‌తో ఇటీవలే ఎస్‌బీఐ మాజీ చైర్మన్ తన జీతం వివరాలను పంచుకున్నారు. ఎస్‌బీఐ బ్యాలెన్స్ షీట్ రూ. 50 లక్షల కోట్లని చెప్పిన రజనీష్, రూ.30 నుంచి 40 లక్షల ఖరీదైన కారును బ్యాంక్ సారథి పొందుతారన్నారు. చైర్మన్ నివాసం కోసం ముంబైలోని మలబార్ హిల్స్‌లో విలాసవంతమైన బంగ్లాను ఇస్తారన్నారు. దాని అద్దె నెలకు కనీసం రూ.2 నుంచి 2.5 కోట్లు ఉంటుందన్నారు. ప్రస్తుత ఛైర్మన్ దినేష్ ఖరా 2022-2023 ఆర్థిక సంవత్సరంలో (FY23) రూ. 37 లక్షల జీతం అందుకున్నారు.గతేడాది కంటే ఇది సుమారు 7.5 శాతం అధికం. ఖరా జీతంలో ప్రాథమిక వేతనం రూ.27 లక్షలు, కరువు భత్యం రూ.9.99 లక్షలుగా బ్యాంక్ నివేదిక తెలిపింది.
ప్రైవేట్ బ్యాంకుల సీఈఓలకు భారీ ప్యాకేజీలు
ప్రభుత్వ రంగ బ్యాంకుల ఛైర్మన్, టాప్ ఎగ్జిక్యూటివ్‌ల కంటే ప్రైవేట్, కార్పోరేట్ బ్యాంకుల సీఈఓలకే జీతం భారీగా ఉంటోంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో యాక్సిస్ బ్యాంక్ ఎండీ, సీఈఓ అమితాబ్ చౌదరి జీతం 7.62 కోట్ల రూపాయలుగా బ్యాంక్ నివేదిక వెల్లడించింది. మరో ప్రైవేట్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సిఈఓ, మేనేజింగ్ డైరెక్టర్(MD) శశిధర్ జగదీషన్‌కు 2021-2022 ఆర్థిక సంవత్సరంలో జీతభత్యాలుగా రూ.6.51 కోట్లను మూటజెప్పినట్లు తెలుస్తోంది. ఇక ఐసీఐసీఐ బ్యాంక్ సీఈఓ సందీప్ బక్షి వార్షిక వేతనంగా రూ.7.08 కోట్ల భారీ ప్యాకేజీని తీసుకోవడం గమనార్హం. వివిధ ప్రైవేట్ బ్యాంకుల వార్షిక జీతభత్యాలు : AXIS - రూ.7.62 కోట్లు HDFC - 6.51 కోట్లు ICICI - రూ.7.08 కోట్ల