2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీని 6.3శాతానికి పెంచిన ఫిచ్
2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వృద్ధి రేటు అంచనాను ప్రముఖ రేటింగ్ సంస్థ ఫిచ్ పెంచేసింది. గతంలో జీడీపీని 6శాతంగా అంచనా వేసిన ఫిచ్ దాన్ని ఇప్పుడు 6.3శాతానికి పెంచింది. ఈ మేరకు గురువారం నివేదికను విడుదల చేసింది. మొదటి త్రైమాసికంలో మంచి వృద్ధిని మోదు చేసిన నేపథ్యంలో జీడీపీ అంచనా మారిపోయింది. గత ఆర్థిక సంవత్సరం భారత వృద్ది 7.2శాతంగా నమోదైంది. 2021-22లో భారత ఆర్థిక వ్యవస్థ 9.1శాతం వృద్ధిని సాధించింది. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధికి మెరుగైన అవకాశాలు ఉన్నాయని, మొదటి త్రైమాసికంతో గణనీయమైన వృద్ధిని నమోదు చేసినట్లు రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ పేర్కొంది. అందుకే 0.3 శాతం జీడీపీని పెంచినట్లు చెప్పింది.
జనవరి-మార్చిలో ఊహించన దానికంటే ఎక్కువ వృద్ధి
వాస్తవానికి 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం జీడీపీ అంచనాను తొలుత ఫిచ్ 6.2శాతంగా నిర్ణయించింది. కానీ తర్వాత పెరిగిన ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల ప్రభావంతో మార్చిలో జీడీపీ అంచనాను 6శాతానికి కుదించింది. ఈక్రమంలో ఇప్పుడు మళ్లీ సవరిస్తూ నివేదికను విడుదల చేసింది. 2024-25, 2025-26 ఆర్థిక సంవత్సరాల్లో భారత్ 6.5శాతం చొప్పున వృద్ధి నమోదవుతుందని అంచనా వేస్తున్నట్లు ఫిచ్ వెల్లడించింది. జనవరి-మార్చిలో భారత జీడీపీ వృద్ధి ఊహించిన దాని కంటే ఎక్కువగా ఉందని రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ పేర్కొంది.