
Income Tax bill: లోక్‌సభ ముందుకు ఆదాయపు పన్ను బిల్లు- 2025
ఈ వార్తాకథనం ఏంటి
ఆరు దశాబ్దాలుగా అమల్లో ఉన్న ఆదాయపు పన్ను చట్టం-1961స్థానంలో కొత్త చట్టాన్ని అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ ప్రక్రియలో భాగంగా ఆదాయపు పన్ను(సంఖ్య-2)బిల్లు-2025 ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు లోక్‌సభలో ప్రవేశపెట్టారు. వాస్తవానికి ఈ బిల్లును కేంద్రం ఈ ఏడాది ఫిబ్రవరిలోనే లోక్‌సభలో సమర్పించింది.అయితే,విపక్ష పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో, దానిని సెలెక్ట్ కమిటీ పరిశీలనకు పంపించారు. ఆ కమిటీ నివేదికలో పేర్కొన్న ప్రతిపాదనలను పరిశీలించిన అనంతరం,వాటిని బిల్లులో చేర్చి సవరణలు చేసి మళ్లీ ఈ రోజు లోక్‌సభ ముందుకు తీసుకువచ్చారు. అదనంగా టాక్సేషన్ చట్టాలు(సవరణ)బిల్లును కూడా సమర్పించారు.సెలెక్ట్ కమిటీ చేసిన సిఫార్సులలో ఎక్కువ భాగాన్ని ఆమోదించినట్లు మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
వివరాలు
66 బడ్జెట్లలో అనేక సార్లు సవరణ
1961లో అమల్లోకి వచ్చిన ఈ ఆదాయపు పన్ను చట్టం, ఇప్పటివరకు వచ్చిన 66 బడ్జెట్లలో (రెండు మధ్యంతర బడ్జెట్లు సహా) అనేక సార్లు సవరించబడింది. ఈ కారణంగా చట్టం క్లిష్టతరం అయింది. పన్ను చెల్లింపుదారులపై ఖర్చులు కూడా పెరిగాయి. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని, చట్టాన్ని సమీక్షించి సులభతరం చేస్తామని ప్రభుత్వం 2024 జూలై బడ్జెట్‌లో ప్రకటించింది. ఆ హామీ ప్రకారమే కొత్త బిల్లును రూపొందించింది.