Swiggy: ₹33 కోట్ల మోసం.. Swiggyకి షాక్ ఇచ్చిన మాజీ ఉద్యోగి
ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ కి చెందిన మాజీ ఉద్యోగి రూ.33 కోట్ల మోసం చేసినట్లు వెల్లడైంది. ఈ విషయం తెలుసుకున్న స్విగ్గీ, పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2023-24 సంవత్సరానికి సంబంధించి స్విగ్గీ వార్షిక నివేదికను పరిశీలించిన సమయంలో, సంస్థ అధికారులు ఒక అనుబంధ సంస్థకు చెందిన మాజీ ఉద్యోగి ఈ మొత్తాన్ని దారి మళ్లించినట్లు గుర్తించారు. ఈ ఘటనను నిశితంగా పరిశీలించేందుకు స్విగ్గీ ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది. మాజీ ఉద్యోగి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు పోలీసులకు సూచించారు. సెప్టెంబర్ 4న విడుదలైన వార్షిక నివేదికలో ఈ విషయాన్ని స్విగ్గీ తెలిపింది, అయితే ఈ విషయంపై స్విగ్గీ ఇప్పటివరకు అధికారిక ప్రకటన ఇవ్వలేదు.
మార్కెట్ స్థానం, IPO ప్రణాళికలు
స్విగ్గీ 2023-24 వార్షిక నివేదిక ప్రకారం, సంస్థ ఆదాయం రూ.1,247 కోట్లకు చేరుకుంది. 2024, జులై 4న బెయిన్ అండ్ కంపెనీ, స్విగ్గీ సంయుక్త నివేదిక విడుదల చేశారు. స్విగ్గీ ఫుడ్ మార్కెట్‌ప్లేస్ సీఈఓ రోహిత్ కపూర్, భారతీయ ఆహార విపణిలో సేవల విస్తరణ గురించి మాట్లాడుతూ, కొన్ని సంవత్సరాలుగా ఆహార సరఫరాలో గణనీయమైన వృద్ధి జరుగుతోందని తెలిపారు. అధిక ఆదాయాలు, డిజిటలీకరణ, మెరుగైన ఖాతాదారు అనుభవం, కొత్త రుచుల వెదుకుతూ ఉండడం వంటివి ఈ వృద్ధికి ప్రధాన కారణాలుగా పేర్కొన్నారు.