LOADING...
Trump tariffs: ట్రంప్ సుంకాలు విధించిన దేశాల పూర్తి జాబితా ఇదే..
ట్రంప్ సుంకాలు విధించిన దేశాల పూర్తి జాబితా ఇదే..

Trump tariffs: ట్రంప్ సుంకాలు విధించిన దేశాల పూర్తి జాబితా ఇదే..

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 31, 2025
06:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియా-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందానికి సంబంధించి తక్కువగా 20 శాతం లోపు టారిఫ్ ఉండొచ్చని సంకేతాలు ఇచ్చినప్పటికీ, ఆయన తాజా నిర్ణయం అంతర్జాతీయ వాణిజ్య వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. భారత్‌పై ఒక్కసారిగా 25 శాతం అధిక సుంకాలు విధించడమే కాదు,రష్యాతో వ్యాపారాలపై జరిమానాలు కూడా విధించబోతున్నట్లు ఆయన ప్రకటించారు. మరింత ఆశ్చర్యకరంగా, భారత్‌తో పాటు 16 దేశాలపై మరింత ఎక్కువ సుంకాలు విధిస్తూ అమెరికా ప్రభుత్వం ఆగస్టు 1, 2025 నుంచి ఈ విధానాన్ని అమల్లోకి తేనుందని వెల్లడించింది.

వివరాలు 

ట్రంప్ 'టారిఫ్ బాంబ్' పేలిన దేశాలు ఇవే..  

ఇప్పటివరకు ట్రంప్ ప్రవేశపెట్టిన టారిఫ్ విధానాల్లో అత్యధికంగా ప్రభావితమైన దేశం బ్రెజిల్. అక్కడి దిగుమతులపై ఏకంగా 50 శాతం టారిఫ్ విధించారు. మయన్మార్,లావోస్ దేశాలపై 40 శాతం చొప్పున సుంకాలు, కంబోడియా, థాయ్‌లాండ్‌పై 36 శాతం, బంగ్లాదేశ్, సెర్బియా, కెనడాపై 35 శాతం చొప్పున టారిఫ్ విధించారు. అలాగే మెక్సికో, దక్షిణాఫ్రికా, బోస్నియా అండ్ హెర్జెగోవినా, శ్రీలంక, అల్జీరియా, ఇరాక్, లిబియా, చైనాలపై 30 శాతం చొప్పున సుంకాలు విధించారు. భారత్‌తో పాటు బ్రూనై, మలేషియా, దక్షిణ కొరియా దేశాలపై 25 శాతం టారిఫ్ విధించనున్నారు. ఇది భారత దిగుమతిదారులకు తీవ్రమైన ఆర్థిక భారం కలిగించేలా ఉంది.

వివరాలు 

కొన్ని దేశాలకు ఉపశమనం  

ఇదే సమయంలో, ట్రంప్ కొన్ని దేశాలతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడంతో, వారికి సుంకాల పరంగా కొంత ఉపశమనం లభించింది. ఉదాహరణకు, వియత్నాంపై 20 శాతం, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్‌పై 19 శాతం చొప్పున టారిఫ్ విధించారు. జపాన్‌పై అయితే కేవలం 15 శాతం మాత్రమే ఉంది. అంతేకాకుండా, కజకిస్తాన్, మోల్డోవా, ట్యునీషియా దేశాలపై కూడా 25 శాతం సుంకాలు విధించబోతున్నారు. యూరోపియన్ యూనియన్‌పై మాత్రం 15 శాతం మాత్రమే టారిఫ్ విధించారు.

వివరాలు 

సుంకాల జాబితా ఇలా..  

బ్రెజిల్ - 50%, మయన్మార్ - 40%, లావోస్ - 40%, కంబోడియా - 36%, థాయ్‌లాండ్ - 36%, బంగ్లాదేశ్ - 35%, సెర్బియా - 35%, కెనడా - 35%, మెక్సికో - 30%, దక్షిణాఫ్రికా - 30%, బోస్నియా అండ్ హెర్జెగోవినా - 30%, శ్రీలంక - 30%, అల్జీరియా - 30%, ఇరాక్ - 30%, లిబియా - 30%, చైనా - 30%

వివరాలు 

అంచనా తలకిందులు  

అంతకు ముందు ట్రంప్ భారతంతో వాణిజ్య ఒప్పందాల సందర్భంలో, టారిఫ్ 20 శాతం లోపే ఉండే అవకాశముందని పదేపదే చెప్పారు. "ప్రతి దేశానికి ప్రత్యేకంగా లేఖ రాయాల్సిన అవసరం లేదు. మేము వాణిజ్య భాగస్వాములకు 15 నుండి 20 శాతం మధ్యే టారిఫ్ విధిస్తాం," అని ఆయన పేర్కొన్నారు. కానీ ఇప్పుడు ట్రంప్ మాట మార్చి, భారత్‌పై 25 శాతం టారిఫ్ విధించడంతో పాటు రష్యా వ్యాపారాలపై జరిమానాలు విధించనున్నట్లు ప్రకటించడంతో, ముందస్తు అంచనాలన్నీ తారుమారు అయ్యాయి.

వివరాలు 

భారత్‌లో ఆందోళన.. వియత్నాంలో సంబరాలు  

భారత్‌పై 25శాతం టారిఫ్ విధించడంతో భారతీయ ఎగుమతిదారులు ఆందోళనకు గురవుతున్నారు. అయితే వియత్నాం ఎగుమతిదారులు మాత్రం సంబరాలు చేసుకుంటున్నారు.కారణం ఏంటంటే.. అమెరికాకు వెళ్లే వారి ఉత్పత్తులపై కేవలం 20శాతం టారిఫ్ మాత్రమే ఉండటమే. ఇది భారత్‌తో పోలిస్తే వారికి 5 శాతం తక్కువ.ఇది కేవలం శాతాల పరిమితి కాదు. గడువు, పరిస్థితులు, మౌలిక సదుపాయాలు కూడా ముఖ్యమైన అంశాలుగా ఉన్నాయి. వాస్తవానికి వియత్నాం ఇప్పటికే ఎలక్ట్రానిక్స్, వస్త్రాలు, సముద్ర ఉత్పత్తుల రంగాల్లో భారత్‌కు గట్టి పోటీగా మారింది. ఈ రంగాలు మాత్రమే భారత్ నుంచి అమెరికాకు జరిగే $91 బిలియన్ ఎగుమతుల్లో దాదాపు 5 శాతం వాటాను కలిగి ఉన్నాయి. వియత్నాం ఈ అవకాశాన్ని తమ వైపుకు మళ్లించేందుకు సిద్ధంగా ఉంది.