LOADING...
Gold: భారత్‌లో బంగారం గిరాకీ 5శాతం పెరిగింది.. వెల్లడించిన ప్రపంచ స్వర్ణ మండలి 
భారత్‌లో బంగారం గిరాకీ 5శాతం పెరిగింది.. వెల్లడించిన ప్రపంచ స్వర్ణ మండలి

Gold: భారత్‌లో బంగారం గిరాకీ 5శాతం పెరిగింది.. వెల్లడించిన ప్రపంచ స్వర్ణ మండలి 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 05, 2025
03:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిగుమతి సుంకం తగ్గడంతో దేశంలో బంగారానికి గిరాకీ పెరిగింది. దీని ద్వారా పెళ్లిళ్ల , పండగ సీజన్‌ కారణంగా 2024లో పసిడి డిమాండ్‌ 5% పెరిగి 802.5 టన్నులకు చేరిందని ప్రపంచ స్వర్ణ మండలి (World Gold Council) వెల్లడించింది. ఈ ఏడాదిలో కూడా పుత్తడి గిరాకీ ఇదే స్థాయిలో ఉండొచ్చని అంచనా వేసింది.

వివరాలు 

గణాంకాలు విడుదల చేసిన ప్రపంచ స్వర్ణ మండలి 

2024 సంవత్సరానికి ప్రపంచవ్యాప్తంగా పసిడి వినియోగంపై ప్రపంచ స్వర్ణ మండలి (WGC) బుధవారం గణాంకాలు విడుదల చేసింది. వాటి ప్రకారం, 2023లో బంగారం గిరాకీ 761 టన్నులు ఉండగా, గతేడాది అది 802.8 టన్నులకు పెరిగింది. ''2025లో బంగారం గిరాకీ 700-800 టన్నుల మధ్య ఉండొచ్చని అంచనా వేయబడింది. అయినప్పటికీ, ఈ ఏడాది ధరల్లో కొంత స్థిరత్వం ఉండొచ్చని భావిస్తున్నాం. దీంతో పెళ్లిళ్ల సీజన్‌లో బంగారు ఆభరణాల కొనుగోళ్లు పెరగవచ్చు'' అని WGC రీజినల్‌ సీఈఓ సచిన్‌ జైన్‌ పేర్కొన్నారు. దిగుమతి సుంకాలు తగ్గించినప్పటికీ గత ఏడాది కాలంలో దేశీయ మార్కెట్లో పసిడి ధర విపరీతంగా పెరిగింది.

వివరాలు 

73 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

కొన్ని నగరాల్లో పది గ్రాముల పుత్తడి ధర రూ.86,000 పైగా పలుకుతోంది. గతేడాది బంగారంలో పెట్టుబడులు 29% పెరిగి 239.4 టన్నులకు చేరినట్లు సచిన్ జైన్ వెల్లడించారు. 2013 తర్వాత పసిడి పెట్టుబడుల్లో ఇదే అత్యధికం కావడం గమనార్హం. 2023లో ఈ మొత్తం 185.2 టన్నులుగా ఉంది. ఇక, గతేడాది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 73 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసినట్లు సచిన్ జైన్ వెల్లడించారు. 2023లో కొనుగోలు చేసిన 16 టన్నులతో పోలిస్తే ఇది నాలుగు రెట్లు ఎక్కువ. యుద్ధాలు, అధిక ద్రవ్యోల్బణం, ఇతర సవాళ్లను దృష్టిలో పెట్టుకొని రిస్కును తగ్గించుకునే ఉద్దేశంతో కేంద్ర బ్యాంకు బంగారం నిల్వలను పెంచుకోవడంపై ఆసక్తి చూపిస్తున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.