outlook for 2025: 2025లో బంగారం, వెండి ధరలు రేట్లు పెరుగుతాయా? తగ్గుతాయా?
ఈ వార్తాకథనం ఏంటి
కొత్త సంవత్సరంలో బంగారం, వెండి కొనుగోలు చేయాలని చూస్తున్నవారు ముందుగా వాటి ధరలపై దృష్టి పెడతారు.
2024లాగే, 2025లో కూడా బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుతాయా అనే అనుమానం చాలా మందిలో ఉంది.
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ప్రపంచ ఆర్థిక అనిశ్చితుల ప్రభావం కారణంగా బంగారం రికార్డు స్థాయిని కొనసాగించే అవకాశం ఉంది.
దేశీయ మార్కెట్లో బంగారం ధర 10 గ్రాములకు రూ.85,000 నుంచి రూ.90,000 వరకు చేరవచ్చు.
అయితే భౌగోళిక రాజకీయ సమస్యలు తగ్గితే లేదా రూపాయి విలువ పతనమైతే, బంగారం ధరలు తగ్గవచ్చు.
వివరాలు
2024లో బంగారం అత్యుత్తమ ప్రదర్శన
ప్రస్తుతం స్పాట్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.79,350గా ఉండగా, మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో రూ.76,600 ఉంది.
2024లో బంగారం అత్యుత్తమ ప్రదర్శనను కనబరిచింది, దేశీయ మార్కెట్లో 23 శాతం రాబడులను నమోదు చేస్తూ అక్టోబర్ 30న రూ.82,400 వద్ద ఆల్‌టైమ్ గరిష్టాన్ని తాకింది.
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు,సెంట్రల్ బ్యాంక్ కొనుగోళ్లు,ప్రధాన బ్యాంకుల తక్కువ వడ్డీ రేట్ల విధానం వంటి అంశాల వల్ల 2025లో కూడా విలువైన లోహాలు బలమైన పనితీరు చూపిస్తాయని నిపుణులు భావిస్తున్నారు.
వివరాలు
2025లో బంగారం ధర పెరిగే అవకాశం
ఎల్కేపీ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ (కమోడిటీస్ అండ్ కరెన్సీ) జతిన్ త్రివేది మాట్లాడుతూ, 2025లో భౌగోళిక ఉద్రిక్తతలు కొనసాగితే బంగారం ధర రూ.85,000 నుంచి రూ.90,000 వరకు పెరగవచ్చని, కేజీ వెండి ధర రూ.1.1 లక్షల నుంచి రూ.1.25 లక్షలకు చేరవచ్చని చెప్పారు.
2024లో బంగారం ధరలపై డిమాండ్, సరఫరా, భౌగోళిక రాజకీయ పరిస్థితులు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ప్రభావం చూపించాయి.
ఈ పరిణామాలు బులియన్ ధరలను పెంచాయి. మరోవైపు అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఆర్థిక విధానాలు, సుంకాలు, ద్రవ్యోల్బణాన్ని 2 శాతానికి తగ్గించాలన్న ఫెడరల్ రిజర్వ్ నిర్ణయం వంటి అంశాలు కూడా బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.