EPFO Wage ceiling: ఈపీఎఫ్‌ఓ వేతన పరిమితి పెంపుపై కేంద్రం త్వరలోనే నిర్ణయం
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర ప్రభుత్వం వేతన జీవులకు త్వరలో శుభవార్త చెప్పే అవకాశాలు కన్పిస్తున్నాయి.
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) కింద ఉన్న ఉద్యోగుల గరిష్ఠ వేతన పరిమితిని (EPFO Wage Ceiling) పెంచాలని కేంద్రం యోచిస్తోంది.
త్వరలోనే ఈ అంశంపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఈ విషయంపై విశ్వసనీయ వర్గాల ఆధారంగా 'ఎకనామిక్ టైమ్స్' పత్రిక కథనం వెలువరించింది.
ప్రస్తుతం ఈపీఎఫ్‌ఓ గరిష్ఠ వేతన పరిమితి రూ. 15,000గా ఉండగా, దానిని రూ. 21,000కు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
వివరాలు
ప్రభుత్వంతో పాటు ప్రైవేటు రంగంపైనా ఆర్థిక భారం
అంతేకాకుండా, కంపెనీల ఈపీఎఫ్‌ఓ నమోదు విషయంలో ఉద్యోగుల సంఖ్య పరిమితిని కూడా తగ్గించాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది.
ప్రస్తుతం 20 మందికి పైగా ఉద్యోగులు ఉన్న సంస్థలు తప్పనిసరిగా ఈపీఎఫ్‌ఓలో నమోదు చేయాల్సి ఉంటుంది.
కానీ ఈ సంఖ్యను 10-15కి తగ్గించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ ప్రతిపాదనకు చిన్న-మధ్యతరహా పరిశ్రమలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం.
వేతన పరిమితిని పెంచడం వల్ల ప్రభుత్వంతో పాటు ప్రైవేటు రంగంపైనా ఆర్థిక భారం పడుతుంది.
కానీ, దీని వలన ఉద్యోగులకు భవిష్యత్తులో మంచి ప్రయోజనం కలుగుతుంది. ఈపీఎఫ్‌ఓ Wage Ceilingని చివరిసారిగా 2014లో సవరించారు. అప్పట్లో రూ.6,500 నుంచి రూ.15,000కు పెంచారు.
వివరాలు
వేతన పరిమితి పెంపుతో ప్రయోజనాలు
వేతన పరిమితిని పెంచితే, ఉద్యోగుల భవిష్య నిధి ఖాతాకు జమ అయ్యే మొత్తం కూడా పెరుగుతుంది.
సాధారణంగా, ఉద్యోగి తన వేతనంలో 12% ,యజమాని కూడా 12% చెల్లిస్తారు.
ఇందులో ఉద్యోగి వాటా మొత్తం ఈపీఎఫ్ ఖాతాలోకి వెళ్తుంది. యజమాని వాటా నుంచి 8.33% పింఛను పథకంలోకి వెళ్ళగా, మిగతా మొత్తం ఈపీఎఫ్ ఖాతాలో జమవుతుంది.
వేతన పరిమితిని పెంచితే, ఆ మేరకు ఉద్యోగి,యజమాని చెల్లించాల్సిన మొత్తం పెరుగుతుంది. దీని వలన, ఉద్యోగి రిటైర్మెంట్ సమయంలో తన భవిష్య నిధి నిల్వలను మరింత పెంచుకోవచ్చు.