
GST rates: దీపావళికి జీఎస్టీ బొనాంజా.. ఇక రెండు శ్లాబు రేట్లే
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధాని నరేంద్ర మోదీ నిత్యావసర ఉత్పత్తులపై జీఎస్టీ రేట్లు తగ్గించనున్నట్లు ప్రకటించారు. దీపావళి నాటికి ఈ తగ్గింపులు అమలులోకి వచ్చి పండగ ఆనందాన్ని రెట్టింపు చేస్తాయని ఆయన చెప్పారు. ఈప్రకటన వెలువడిన కొద్దిసేపటికే ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. ఇకపై జీఎస్టీలో రెండు శ్లాబులు మాత్రమే ఉంటాయని, కొన్ని ఉత్పత్తులకు ప్రత్యేక రేట్లు వర్తిస్తాయని స్పష్టం చేసింది. ప్రస్తుతం అమలులో ఉన్న 5, 12, 18, 28 శాతం జీఎస్టీ శ్లాబులు ఈ మార్పుతో తగ్గనున్నాయి. ఎర్రకోట వేదికగా 79వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో మోదీ మాట్లాడుతూ, గడిచిన ఎనిమిదేళ్లలో జీఎస్టీ వ్యవస్థలో అనేక సంస్కరణలు చేపట్టామని చెప్పారు. రాష్ట్రాలతో చర్చించి తదుపరి దశ సంస్కరణలను అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.
Details
సామాన్య ప్రజలకు ఉపశమనం
ఈ మార్పుల వల్ల పన్ను భారం తగ్గి సామాన్య ప్రజలకు ఉపశమనం కలుగుతుందని, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు కూడా లాభం చేకూరుతుందని తెలిపారు. నిత్య వినియోగ వస్తువుల ధరలు తగ్గడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. అయితే ఎలాంటి ఊరట చర్యలు అమలు చేస్తారన్న వివరాలను ఆయన వెల్లడించలేదు. ఆ తర్వాత విడుదల చేసిన ప్రకటనలో ఆర్థిక మంత్రిత్వ శాఖ, 'ఆత్మనిర్భర్ భారత్' లక్ష్యంతో జీఎస్టీకి మరిన్ని సంస్కరణలను ప్రతిపాదిస్తున్నట్లు తెలిపింది. ఈ బ్లూప్రింట్‌ను మూడు స్తంభాలపై రూపొందించిందని - నిర్మాణాత్మక సంస్కరణలు, పన్ను రేట్ల హేతుబద్ధీకరణ, జీవన వ్యయాల తగ్గింపు అని పేర్కొంది.
Details
జీఎస్టీ కౌన్సిల్ ఏర్పాటు
సాధారణ ప్రజలు వాడే వస్తువుల ధరలు తగ్గించడమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర మంత్రులతో కూడిన మంత్రుల బృందాన్ని జీఎస్టీ కౌన్సిల్ ఏర్పాటు చేసిందని తెలిపింది. ఇకపై స్టాండర్డ్, మెరిట్ అనే రెండు రేట్లు మాత్రమే అమలులో ఉండేలా ప్రతిపాదనలు రూపొందించామని తెలిపింది. ఈ ప్రతిపాదనలను మంత్రుల బృందం చర్చలకు పంపినట్లు, రాబోయే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో వాటిపై ఏకాభిప్రాయం సాధిస్తామని పేర్కొంది. ఈ సమావేశం సెప్టెంబర్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరగనున్న అవకాశం ఉంది.