LOADING...
GST: జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం.. రెండు శ్లాబ్‌ల రద్దు..ఈ నెల 22 నుంచి అమల్లోకి కొత్త మార్పు 
జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం.. రెండు శ్లాబ్‌ల రద్దు

GST: జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం.. రెండు శ్లాబ్‌ల రద్దు..ఈ నెల 22 నుంచి అమల్లోకి కొత్త మార్పు 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 03, 2025
10:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆర్థిక రంగానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటి వరకు మొత్తం నాలుగు జీఎస్టీ శ్లాబ్‌లు అమల్లో ఉండగా, ఇకముందు వాటిని తగ్గించేలా నిర్ణయం తీసుకున్నారు. 12 శాతం,28 శాతం శ్లాబ్‌లను రద్దు చేయడానికి కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ఈ మార్పులతో భవిష్యత్తులో కేవలం 5 శాతం, 18 శాతం శ్లాబ్‌లు మాత్రమే కొనసాగనున్నాయి. అలాగే విలాసవస్తువులపై 40% జీఎస్టీ విధించనున్నారు. సమావేశం అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియాకు వివరాలు వెల్లడించారు.

వివరాలు 

కొత్త స్లాబ్‌ల అమలుతో పేద,మధ్య తరగతి ప్రజలకు ఉపశమనం

నెక్ట్స్‌ జెనరేషన్ సంస్కరణలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టారని తెలిపారు. జీఎస్టీలో రెండు మాత్రమే స్లాబ్‌లు కొనసాగించాలన్న నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ముఖ్యంగా రైతులు,సామాన్య ప్రజల అభిరుచులను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయాలు తీసుకున్నామని స్పష్టం చేశారు. వ్యవసాయం, వైద్య రంగానికి ఊరట కలిగించే నిర్ణయాలకు ఆమోదం తెలిపినట్లు చెప్పారు. జీఎస్టీ ఫైలింగ్ ప్రక్రియను మరింత సరళతరం చేస్తున్నట్లు తెలిపారు. కొత్త స్లాబ్‌ల అమలుతో పేద,మధ్య తరగతి ప్రజలకు ఉపశమనం కలుగుతుందని, పలు ఐటంలపై 0% జీఎస్టీ ఉండనుందని ఆమె స్పష్టంగా తెలిపారు. పేదలు, సామాన్యులు ఎక్కువగా వాడే వస్తువులపై 5% జీఎస్టీ మాత్రమే ఉండనుందని, అన్ని రకాల టీవీలపై 18% జీఎస్టీ ఉంటుందని వెల్లడించారు.

వివరాలు 

రోటీ, పరోటాలపై పూర్తిగా పన్ను రద్దు

కొత్త మార్పుల ప్రకారం గుట్కా, పొగాకు, సిగరెట్లు వంటి ఉత్పత్తులను మినహాయించి మిగతా అన్ని వస్తువులపై ఈ నెల 22వ తేదీ నుంచే కొత్త పన్ను రేట్లు అమలులోకి రానున్నాయి. తలనూనెలు, కార్న్‌ఫ్లేక్స్, టెలివిజన్లు, ఆరోగ్య సంబంధ ఉత్పత్తులు, జీవిత బీమా పథకాలు వంటి వాటిపై పన్ను తగ్గించనున్నారు. ఇక రోటీ, పరోటాలపై పూర్తిగా పన్ను రద్దు చేయగా, ప్రాణాధార ఔషధాలపై కూడా ఎటువంటి జీఎస్టీ ఉండదు. ఖరీదైన కార్లు, పొగాకు ఉత్పత్తులు, సిగరెట్ల వంటి వాటికి ప్రత్యేకంగా 40% స్లాబ్ ప్రతిపాదించారు. వ్యక్తిగత వినియోగ వస్తువులపై పన్ను తగ్గింపుతో దేశీయ వినియోగం పెరుగుతుందని, అలాగే అమెరికా సుంకాల భారం కొంతవరకు తగ్గుతుందని కేంద్రం భావిస్తోంది.

వివరాలు 

ఇతరాలు 

పండుగ సీజన్‌లో వినియోగం మరింత పెరిగేలా, వాణిజ్యం వేగంగా అభివృద్ధి చెందేలా మండలి తీసుకున్న నిర్ణయాలు సహాయపడతాయని అంచనా. ముఖ్యంగా జీవిత బీమా పథకాలపై జీఎస్టీని తొలగించడం వల్ల కోట్లాది మంది ప్రజలు సులభంగా బీమా పొందే అవకాశం కలుగుతుంది. అన్ని రాష్ట్రాల సమ్మతితోనే ఈ నిర్ణయాలు తీసుకున్నామని, ఏ రాష్ట్రం కూడా వ్యతిరేకించలేదని సమావేశానంతరం నిర్మలా సీతారామన్ వెల్లడించారు. సిమెంటుపై జీఎస్టీని 28% నుంచి 18%కి తగ్గించారు. హస్తకళా ఉత్పత్తులు, పాలరాయి, గ్రానైట్ దిమ్మెలపై కేవలం 5% పన్ను మాత్రమే అమలు అవుతుంది. విద్యుత్ వాహనాలపై ఇప్పటి మాదిరిగానే 5% పన్ను కొనసాగుతుంది.

వివరాలు 

ప్రజల జీవితాలు మెరుగుపడతాయి..: 'ఎక్స్‌'లో ప్రధాని నరేంద్ర మోదీ

రేస్‌క్లబ్బులు, లీజింగ్‌/రెంటల్ సేవలు, క్యాసినోలు, జూదం, గుర్రపు పందేలు, లాటరీ, ఆన్‌లైన్ మనీ గేమ్స్‌పై 40% పన్ను విధించనున్నారు. ఈ మార్పుల కారణంగా సుమారు రూ.48,000 కోట్ల మేర ఆదాయం తగ్గిపోతుందని రెవెన్యూ శాఖ కార్యదర్శి అరవింద్ శ్రీవాస్తవ వెల్లడించారు. జీఎస్టీ శ్లాబుల హేతుబద్ధీకరణపై ప్రధాని నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. "సాధారణ ప్రజల జీవితాలను మెరుగుపరచడం, ఆర్థిక వ్యవస్థను బలపరచడం లక్ష్యంగా కేంద్రం రూపొందించిన ప్రతిపాదనపై మండలి ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయం అభినందనీయమైనది. ఈ మార్పులు చిన్న వ్యాపారులు, రైతులు, మధ్యతరగతి, మహిళలు, యువతకు విస్తృతంగా ఉపయోగపడతాయి" అని ఆయన 'ఎక్స్‌'లో పేర్కొన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ట్వీట్