GST Council Meet: వచ్చే నెల జీఎస్టీ కౌన్సిల్ సమావేశం.. టర్మ్ ఇన్సూరెన్స్‌పై జీఎస్టీ తొలగింపు..?
బీమా పాలసీల ప్రీమియంలపై జీఎస్టీ (GST) రద్దు చేయాలంటూ పెరుగుతున్న డిమాండ్లను పరిగణనలోకి తీసుకుంటూ, త్వరలో ఈ విషయంలో కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ముఖ్యంగా టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలను జీఎస్టీ నుంచి మినహాయించే అవకాశముందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. త్వరలో జరగనున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ అంశంపై నిర్ణయం వెలువడుతుందని 'మనీ కంట్రోల్' తన కథనంలో పేర్కొంది. కాగా, పెట్టుబడులకు సంబంధించిన బీమా పాలసీలపై మాత్రం జీఎస్టీ యథావిధిగా కొనసాగనుంది. టర్మ్ ఇన్సూరెన్స్ పూర్తిస్థాయి రక్షణను అందించే విధంగా ఉండటంతో దీనిపై మినహాయింపు ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ చర్య వల్ల ప్రభుత్వం సుమారు రూ. 200 కోట్ల ఆదాయం కోల్పోయే అవకాశమున్నప్పటికీ, పాలసీదారులకు ఇది ప్రయోజనకరమవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
టర్మ్ ఇన్సూరెన్స్, ఆరోగ్య బీమా పై 18% జీఎస్టీ
ఈ నిర్ణయం తీసుకుంటే, మరింత మంది బీమా పరిధిలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్‌కు లేఖ రాయడంతో ఈ చర్చ మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయనకు వచ్చిన విజ్ఞప్తుల ఆధారంగా, జీవిత, ఆరోగ్య బీమా పాలసీలపై కూడా జీఎస్టీ తగ్గించాలని సూచించారు. ప్రస్తుతం టర్మ్ ఇన్సూరెన్స్, ఆరోగ్య బీమా పై 18% జీఎస్టీ అమలులో ఉంది, అయితే సంప్రదాయ బీమా పాలసీలపై వేర్వేరు రేట్లు వర్తిస్తున్నాయి. ఇది టర్మ్ ఇన్సూరెన్స్‌కే పరిమితమవుతుందా లేదా ఆరోగ్య బీమా పాలసీలపై కూడా జీఎస్టీ తగ్గిస్తారా అనే అంశంపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.