
US tariffs-GST reforms: అమెరికా సుంకాలకు జీఎస్‌టి సంస్కరణలతో చెక్..!
ఈ వార్తాకథనం ఏంటి
మన దేశంపై అమెరికా విధించిన 50 శాతం సుంకాలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. అయితే,త్వరలో రాబోయే జీఎస్‌టి (GST) సంస్కరణలు ఈ టారిఫ్‌ల ప్రభావాన్ని తట్టుకోగలవని ఫిచ్ సొల్యూషన్స్ కంపెనీ బీఎంఐ గురువారం ప్రకటించింది. అంతేకాక, భారత్ ఆసియాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న మార్కెట్ ఎకానమీలలో ఒకటిగా కొనసాగుతుందని బీఎంఐ వెల్లడించింది. సుంకాల వల్ల కొన్ని పరిశ్రమలు కొంతమేరకు ప్రభావితమవ్వవచ్చునని అంచనా ఉన్నప్పటికీ, భారత జీడీపీ వృద్ధి రేటు 6 శాతంపైనే కొనసాగుతుందని బీఎంఐ పేర్కొంది. రాబోయే దశాబ్దంలో ఉత్పాదకత 5శాతం పెరుగుతుందని,అది జీడీపీ వృద్ధికి సహకరిస్తుందని కూడా వెల్లడించింది.
వివరాలు
జీఎస్‌టి విధానంలో మార్పులు
బీఎంఐ ప్రకారం,''ఈ జీఎస్‌టి సంస్కరణలు మన ఆర్థిక వృద్ధికి ఎదురుగా ఉన్న సవాళ్లను తొలగించగలవు. ప్రస్తుతం ఉన్న అంచనాలు కూడా వృద్ధికి ఉత్ప్రేరకంగా ఉంటాయని మేము భావిస్తున్నాము.'' వస్తు-సేవల పన్ను (GST) విధానంలో మార్పులు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ప్రస్తుతం నాలుగు పన్ను శ్రేణులు (5%, 12%, 18%, 28%) అమల్లో ఉన్నాయి. కొత్త విధానంలో ఈ శ్రేణులు రెండు (5%,18%) మాత్రమే మిగులుతాయి. దీపావళి పండుగ సందర్భంగా కొత్త జీఎస్‌టి రేట్ల అమలు వల్ల,అందుబాటు ధరలో లభ్యమయ్యే కార్లు వినియోగదారులను మరింత ఆకర్షిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. పండుగ ఉత్సాహానికి ఇది సహకరిస్తుందని, వాహనాల ఇంజిన్ సామర్థ్యం, పరిమాణం ఆధారిత వర్గీకరణలో ఉన్న వివాదాలను కొత్త రేట్లు పరిష్కరిస్తాయని ఆశిస్తున్నారు.
వివరాలు
వినియోగం పెంపు లక్ష్యం
ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త పన్ను రేట్ల ప్రధాన లక్ష్యం వినియోగాన్ని పెంపొందించడం. ఆటోమొబైల్స్, ఆర్థిక సేవలు, సిమెంట్ రంగాలు ఈ మార్పుల వల్ల లాభపడతాయని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలాగే, జీఎస్‌టి సంస్కరణలు మరియు ఇటీవలి ఆదాయపు పన్ను కోతలను కలిపి, వినియోగంలో రూ.5.31 లక్షల కోట్ల పెరుగుదల సాధ్యమని ఎస్‌బీఐ రిసెర్చ్ నివేదిక వెల్లడించింది. ఇది దేశ జీడీపీలో 1.6 శాతానికి సమానం. మరోవైపు, ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ మన దేశ రేటింగ్‌ను 'BBB-' నుంచి 'BBB'కు పెంచింది. అమెరికా సుంకాల ప్రభావం పరిమితంగా ఉంటుందని కూడా అంచనా వేసింది.
వివరాలు
దీపావళి తర్వాత అదనపు సుంకాల పరిస్థితి
ప్రస్తుతం అమెరికా విధించిన అదనపు సుంకాలతో కలిపి భారత ఎగుమతులకు 50 శాతం టారిఫ్‌లు వర్తిస్తున్నాయి. అయితే, యూఎస్ పరస్పర సుంకాలు 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు 25 శాతంగా ఉంటాయని గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ గ్రూప్ నోమురా అంచనా వేసింది. దీపావళి తర్వాత 25 శాతం పెనాల్టీ సుంకాలను తొలగించడం కూడా సాధ్యమని వారు వెల్లడించారు.