
GST: జీఎస్టీ సవరణలతో ప్రభుత్వానికి రూ.3,700 కోట్లు నష్టం: ఎస్‌బీఐ రిపోర్ట్
ఈ వార్తాకథనం ఏంటి
వస్తు,సేవల పన్ను (జీఎస్టీ) రేట్లలో ఇటీవల జరిగిన తగ్గింపుల కారణంగా కేంద్ర ప్రభుత్వానికి దాదాపు రూ.3,700 కోట్ల వరకు ఆదాయం తగ్గే అవకాశం ఉందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తాజా నివేదిక వెల్లడించింది. జీఎస్టీ సవరణల మొత్తం వార్షిక ప్రభావాన్ని ప్రభుత్వం రూ.48 వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా వేసిందని రిపోర్ట్ పేర్కొంది. అయితే వినియోగం పెరగడం, ఆర్థిక వృద్ధి వేగవంతం కావడం వల్ల నిజమైన నష్టం పరిమితమై రూ.3,700 కోట్లకు చేరవచ్చని,ఈ లోటు వల్ల దేశ ఆర్థిక లోటుపై ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండదని ఎస్‌బీఐ స్పష్టం చేసింది.
వివరాలు
విలాస వస్తువులపై ప్రత్యేకంగా 40 శాతం పన్ను
సెప్టెంబర్ 3న జరిగిన జీఎస్టీ కౌన్సిల్ 56వ సమావేశంలో ఇప్పటివరకు అమలులో ఉన్న నాలుగు శ్లాబుల విధానాన్ని మార్చి,కేవలం రెండు శ్లాబుల పద్ధతిని అమలు చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో 12 శాతం, 28 శాతం విభాగాలను పూర్తిగా రద్దు చేశారు. అదనంగా, విలాస వస్తువులపై ప్రత్యేకంగా 40 శాతం పన్ను విధించాలని నిర్ణయించారు. ఈ సవరణల కారణంగా బ్యాంకింగ్ రంగంలో ఖర్చులు తగ్గి, దీని ప్రభావం సానుకూలంగా ఉంటుందని నివేదిక పేర్కొంది. సవరణలకు ముందు జీఎస్టీ రేట్లు 5%, 12%, 18%, 28% శ్లాబులుగా ఉండేవి.
వివరాలు
రిటైల్ ద్రవ్యోల్బణం 25-30 బేసిస్ పాయింట్ల మేర తగ్గే అవకాశం
అయితే కొత్త మార్పుల ప్రకారం దాదాపు 295 ఉత్పత్తులపై జీఎస్టీ రేట్లు 12 శాతం నుండి 5 శాతం లేదా సున్నా శాతానికి తగ్గించబడ్డాయి. ఫలితంగా, ఆ విభాగంలో రిటైల్ ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 25-30 బేసిస్ పాయింట్ల మేర తగ్గవచ్చని రిపోర్ట్ అంచనా వేసింది. మొత్తానికి, రిటైల్ ద్రవ్యోల్బణం 2026-27 నాటికి 65-75 బేసిస్ పాయింట్ల వరకు తగ్గే అవకాశం ఉందని ఎస్‌బీఐ అంచనాలు సూచిస్తున్నాయి.