LPG Price Hike: హోటళ్లు, రెస్టారెంట్లకు భారీ షాక్.. కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర భారీగా పెంపు
చమురు మార్కెటింగ్ సంస్థలు మంగళవారం వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచుతున్నట్లు అధికారికంగా ధ్రువీకరించాయి. ఈ సిలిండర్ల ధరల పెరుగుదల వాణిజ్య రంగంలోని వ్యాపారాలు, సంస్థలపై అధిక భారాన్ని మోపనుంది. 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర ఇప్పుడు రూ. 48.50 మేర పెరిగడం గమనార్హం. దీని కారణంగా దిల్లీలో ఈ సిలిండర్ ధర రూ. 1,740కి చేరింది. ఇక హైదరాబాద్‌లో 19 కిలోల సిలిండర్ ధర రూ. 1,967 ఉండగా, విజయవాడలో ఈ ధర రూ. 1,901కి చేరింది. విశాఖపట్నంలో రూ. 1,798.50కి చేరగా, తిరుపతిలో రూ. 1,921.50గా ఉంది.
దేశీయ ఎల్పీజీ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు
5 కిలోల ఫ్రీ ట్రేడ్ ఎల్పీజీ సిలిండర్ ధర కూడా రూ. 12 మేర పెరిగింది. ముఖ్యంగా రెస్టారెంట్లు, హోటళ్లు, ఇతర వాణిజ్య రంగాలు ఈ పెరుగుదలతో నేరుగా ప్రభావితమవుతాయి. గత నెల సెప్టెంబరు 1న కూడా చమురు కంపెనీలు 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరలను రూ. 39 మేర పెంచిన విషయం తెలిసిందే. దేశీయ ఎల్పీజీ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఈ నిర్ణయం గృహ వినియోగదారులకు కొంత ఉపశమనం కలిగించనుంది.