యూపీఐ ఏటీఎంలు వచ్చేస్తున్నాయి.. జస్ట్ స్కాన్ చేసి డబ్బు తీసుకోవచ్చు
కొవిడ్ కాలం తర్వాత భారత్‌లో యూపీఐ సేవలు మరింత దూసుకెళ్తున్నాయి. దీంతో డిజిటల్ బ్యాంకింగ్ సేవలు విస్త్రృతమయ్యాయి. ఈ మేరకు కొత్తగా యూపీఐ(UPI-) ఏటీఎంలు వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలోనే యూపీఐతో ఏటీఎంలో నగదు విత్‌డ్రా చేసుకునే సౌలభ్యం త్వరలోనే అమల్లోకి రానుంది. ఈ ప్రత్యేక సాఫ్ట్ వేర్‌ను రూపొందించిన ఏటీఎంను ముంబైలోని గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌లో ప్రదర్శించారు. ఏటీఎం తెరపై రూ. 100, రూ.500, రూ.1000, రూ.2000, రూ.5000 వేలను ఉపసంహరించేందుకు ఆప్షన్ కనిపిస్తుంది. ఇది కాకుండా ఇతర అమౌంట్ కావాలంటే మరో ఆఫ్షన్ కూడా పొందుపర్చారు. ఈ నేపథ్యంలోనే మనకు కావాల్సిన నగదును స్క్రీన్ పై టచ్ చేస్తే డిస్‌ప్లేపై క్యూ ఆర్ కోడ్ వస్తుంది.
NPCI సహకారంతో అందుబాటులోకి క్యాష్ విత్‌డ్రా సేవలు
ఫోన్‌లోని ఏదైనా యూపీఐ యాప్ స్కానర్‌ను ఆన్ చేసి సదరు క్యూర్ కోడ్‌ను స్కాన్ చేయాలి. తర్వాత పిన్ ఎంటర్ చేశాక, నగదు బయటకు వస్తుంది. ఎటువంటి ఏటీఎం కార్డు లేకుండానే అకౌంట్ నుంచి నగదు ఉపసంహరించుకునే సౌకర్యం త్వరలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. ఈ మేరకు తాజా సేవలు దేశవ్యాప్తంగా ప్రతి మారుమూల ప్రాంతానికీ విస్తరించనున్నాయి. వైట్ లేబుల్ ఏటీఎంలతో హిటాచీ పేమెంట్ సర్వీసెస్ కంపెనీ సేవలను అందించేందుకు ముందుకొచ్చింది. వీటిని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) సహకారంతో సురక్షితమైన క్యాష్ విత్‌డ్రా సేవలుగా అందుబాటులోకి తీసుకురానుంది. ఫిజికల్ కార్డుల అవసరాన్ని తొలగించడం ద్వారా వినియోగదారుల భద్రత పెరుగనున్నట్లు హిటాచీ ఎండీ, సీఈవో సుమిల్ వికామ్సే అన్నారు.