
GST: జీఎస్టీ తగ్గింపు ప్రభావం.. వాహనాల కొనుగోళ్లకు తాత్కాలికంగా బ్రేక్!
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ స్లాబులను తగ్గించే నిర్ణయం తీసుకోవడంతో వాహనాల కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఈ నెల 22 నుంచి కొత్త స్లాబులు అమల్లోకి రానుండటంతో, ఇప్పుడే కొనుగోలు చేయకుండా వినియోగదారులు వేచి చూస్తున్నారు. ప్రస్తుతం కార్లు, ద్విచక్ర వాహనాలపై 28 శాతం ఉన్న జీఎస్టీని 18 శాతానికి తగ్గించారు. దాంతో ధరలు గణనీయంగా తగ్గబోతున్నాయి. ఈ ప్రభావంతో కొనుగోలు దారులు ముందస్తు బుకింగ్ చేయడం ఆపేసి, షోరూంలకు రావడమే తగ్గిపోయింది. వ్యాపారాలు స్తంభించి వెలవెలబోయే పరిస్థితి ఏర్పడింది.
Details
మధ్యతరగతికి ఊరట
జీఎస్టీ మార్పులు సామాన్య, మధ్యతరగతి వర్గాల వారికి ఊరటనిచ్చేలా మారాయి. వాహనాల ధరలు గణనీయంగా తగ్గనున్నాయి. ద్విచక్ర వాహనాల ధరలు రూ.8 వేలు నుంచి రూ.20 వేలు వరకు తగ్గవచ్చు. కార్ల ధరల్లో రూ.60 వేలు నుంచి రూ.1.50 లక్షల వరకు తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా 350 సీసీ ద్విచక్ర వాహనాలు, 1200 సీసీ లోపు పెట్రోల్, పెట్రోల్ హైబ్రిడ్, ఎల్పీజీ, సిఎన్‌జీ కార్లు, 1500 సీసీ లోపు డీజిల్, డీజిల్ హైబ్రిడ్ కార్లు, త్రిచక్ర వాహనాలపై జీఎస్టీని 28 నుంచి 18 శాతానికి తగ్గించారు.
Details
దసరా సీజన్‌కి బంపర్ సేల్స్ ఆశ
సాధారణంగా దసరా పండుగ రోజున వాహనాల కొనుగోళ్లు చేసే సంప్రదాయం ఉంది. ముందస్తుగా వాహనాలను బుక్ చేసుకొని దసరా రోజునే స్వీకరించడం అలవాటు. ఈసారి జీఎస్టీ తగ్గింపుతో దసరాకు వాహనాల ధరలు తగ్గనున్నాయి. అందువల్ల ఆ సీజన్‌లో కొనుగోళ్లు భారీగా పెరుగుతాయని విక్రయ కేంద్రాలు భావిస్తున్నాయి. ప్రస్తుతానికి షోరూంలలో అమ్మకాలు ఆగిపోయినా, దసరా సమయానికి ఆఫర్లు, కొత్త వాహనాలు వినియోగదారులను ఆకర్షించనున్నాయి. డిమాండ్ ఎక్కువగా ఉండటంతో కావాల్సిన మోడల్స్ అందుబాటులో ఉండకపోవచ్చని షోరూం యజమానులు చెబుతున్నారు.
Details
షోరూంల అంచనాలు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వందకు పైగా కార్లు, ద్విచక్ర వాహనాల షోరూంలు ఉన్నాయి. నెలకు 500 నుంచి 1000 ద్విచక్ర వాహనాలు, 100 నుంచి 200 కార్లు అమ్ముడవుతుంటాయి. ప్రస్తుతం కొనుగోలు దారులు ధర తగ్గింపుని ఎదురుచూస్తూ వెనక్కి తగ్గడంతో కోట్ల రూపాయల వ్యాపారాలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. అయితే, జీఎస్టీ తగ్గింపుతో రాబోయే రోజుల్లో వినియోగదారులకు మంచి అవకాశం రానుంది