Page Loader
US Tariffs: భారతీయ ఎగుమతులపై US టారిఫ్‌లు ప్రభావం తక్కువే : SBI
భారతీయ ఎగుమతులపై US టారిఫ్‌లు ప్రభావం తక్కువే : SBI

US Tariffs: భారతీయ ఎగుమతులపై US టారిఫ్‌లు ప్రభావం తక్కువే : SBI

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 17, 2025
11:49 am

ఈ వార్తాకథనం ఏంటి

తమ దేశ ఉత్పత్తులపై సుంకాలు విధిస్తున్న దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రతి సుంకంతో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో మిత్ర దేశమైన భారత్‌కు కూడా ఎలాంటి మినహాయింపు ఉండబోదని ఇటీవల ప్రధాని మోదీ సమక్షంలోనే స్పష్టం చేశారు. దీంతో మన దేశంపై వాణిజ్య ఆంక్షలు ఉండొచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే, అమెరికా సుంకాల (US Tariffs) పెంపు వల్ల భారత ఎగుమతులపై తక్కువ ప్రభావమే ఉంటుందని స్టేట్‌ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.

వివరాలు 

మన ఎగుమతులపై కేవలం 3 నుండి 3.5 శాతం మాత్రమే

"ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం, భారత ఉత్పత్తులపై అమెరికా అత్యధికంగా 15-20 శాతం వరకు సుంకాలు విధించినా, ఆ ప్రభావం మన దేశంపై పరిమితంగానే ఉంటుంది. మన ఎగుమతులపై కేవలం 3 నుండి 3.5 శాతం మాత్రమే ప్రభావం పడుతుంది. దాన్ని కూడా ఎగుమతుల లక్ష్యాలు పెంచుకొని తగ్గించుకునే అవకాశం మనకు ఉంది"అని ఎస్‌బీఐ తమ నివేదికలో పేర్కొంది. అంతేగాక, ఎగుమతుల్లో వ్యూహాత్మక వైవిధ్యం,విలువలు పెంచుకోవడం,కొత్త వాణిజ్య మార్గాలను అన్వేషించడం వంటి చర్యలతో అమెరికా సుంకాల ప్రభావాన్ని తగ్గించుకోవచ్చని ఎస్‌బీఐ అంచనా వేస్తోంది. ఐరోపా,మధ్యప్రాచ్యం,ఇతర దేశాలతో న్యూదిల్లీ వాణిజ్య బంధం పెరుగుతున్న వేళ,సరఫరా గొలుసును బలోపేతం చేసుకునే అవకాశాలపై భారత్ దృష్టిపెట్టొచ్చని పేర్కొంది. ఇలా చేయడం ద్వారా ఎగుమతుల్లో స్థిరత్వం సాధించగలమని అభిప్రాయపడింది.

వివరాలు 

సుంకాలు పెంచినా మనపై ప్రభావం తక్కువే

భారత్ ఉత్పత్తులపై అమెరికా గత కొంతకాలంగా స్థిరమైన సుంకాలను విధిస్తోంది. ప్రస్తుతం మన దేశ ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న టారిఫ్‌ల సగటు రేటు 3.3% కాగా, అమెరికా ఉత్పత్తులపై మన దేశం విధిస్తున్న టారిఫ్‌ల సగటు రేటు 17 శాతంగా ఉంది. భారత్‌కు అమెరికా ఎగుమతి చేస్తున్న వస్తువుల విలువలో 75% వరకు సగటు టారిఫ్ 5% లోపే ఉంది. అందువల్ల, సుంకాలు పెంచినా మనపై ప్రభావం తక్కువేనని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మన దేశం నుంచి గత ఆర్థిక సంవత్సరంలో 27.8 బిలియన్ డాలర్ల ఔషధాలు ఎగుమతి కాగా, ఇందులో అమెరికాకే 31.35% చేరాయి.