New income tax bill: ఆదాయపు పన్ను అధికారులకు కొత్త అధికారాలు.. ఇకపై సోషల్ మీడియా ఖాతాలు, ఇ-మెయిల్స్ చూడొచ్చు..!
ఈ వార్తాకథనం ఏంటి
ఇకపై ఆదాయపు పన్ను విభాగం అధికారులకు వ్యక్తుల సోషల్ మీడియా ఖాతాలు, ఇ-మెయిల్స్, ఆన్‌లైన్ పెట్టుబడులు, ట్రేడింగ్ అకౌంట్ల వివరాలను పరిశీలించే అధికారాలు లభించనున్నాయి.
పన్ను ఎగవేతకు పాల్పడటం లేదా ఆదాయానికి మించి ఆస్తులు, నగదు, బంగారం కలిగి ఉన్నట్లు గుర్తిస్తే, సంబంధిత వ్యక్తుల ఖాతాలను పరిశీలించేందుకు వీలు కల్పించనున్నారు.
కేంద్ర ప్రభుత్వం రూపొందించిన కొత్త ఆదాయపు పన్ను బిల్లులో ఈ నిబంధనలను పొందుపరిచారు. ఈ మార్పులతో ఐటీ అధికారులకు మరింత విస్తృతమైన అధికారాలు కలిగే అవకాశం ఉంది.
వివరాలు
లాకర్లు, డోర్లు పగలగొట్టే అధికారం కూడా..
ప్రస్తుతం అమల్లో ఉన్న ఆదాయపు పన్ను చట్టం, 1961 ప్రకారం, ఆదాయపు పన్ను అధికారులకు పరిమితమైన అధికారాలు మాత్రమే ఉన్నాయి.
విశ్వసనీయ సమాచారం ఆధారంగా పన్ను ఎగవేత జరిగిందని అనుమానం వస్తే, అధికారులు సోదాలు, తనిఖీలు నిర్వహించేందుకు వీలుంది.
అలాగే, సంబంధిత ఆర్థిక పత్రాలు, డాక్యుమెంట్లు దాచిపెట్టినట్లు అనిపిస్తే, లాకర్లు, డోర్లు పగలగొట్టే అధికారం కూడా ప్రస్తుతం అమల్లో ఉంది.
అయితే, కొత్తగా రూపొందించిన ఆదాయపు పన్ను బిల్లులో మరిన్ని విస్తృత అధికారాలు చేర్చారు.
ఇకపై వర్చువల్ డిజిటల్ సిస్టమ్ లేదా కంప్యూటర్ సిస్టమ్‌లోకి ప్రవేశించే అధికారం కూడా ఐటీ అధికారులకు లభించనుంది.
వివరాలు
ఏప్రిల్ 1 నుంచి అమలులోకి..
డిజిటల్ యుగానికి అనుగుణంగా రూపొందించిన ఈ నిబంధనల ప్రకారం, ఆదాయపు పన్ను ఎగవేతకు సంబంధించి సమాచారం ఉంటే, సంబంధిత వ్యక్తుల ఇ-మెయిల్స్, బ్యాంక్ ఖాతాలు, ట్రేడింగ్ ఖాతాలు, సోషల్ మీడియా కార్యకలాపాలను పరిశీలించేందుకు అధికారులకు వీలు ఉంటుంది.
ఈ కొత్త బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందితే, 2026 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానుంది. అయితే, ఈ మార్పులు పన్ను ఎగవేతను నిరోధించగలవా? లేదా, వ్యక్తిగత గోప్యతపై కొత్త ఆందోళనలకు దారి తీస్తాయా? అనే ప్రశ్నలకు సమాధానం రానున్న కాలంలో తెలుస్తుంది.