
IT Refund: ఆదాయపన్ను చెల్లింపుదారులకు గుడ్‌న్యూస్.. ఐటీఆర్ ఫైల్ చేసిన 4గంటల్లోనే రిఫండ్!
ఈ వార్తాకథనం ఏంటి
ఆదాయపన్ను రిటర్నులు (ITR) దాఖలు చేసిన తరువాత రిఫండ్ వచ్చే విషయంలో ఇప్పటి వరకు నెలల తరబడి ఎదురుచూపులు ఉండటం మామూలే. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎందుకంటే, ఇటీవలి పరిణామాల్లో రిఫండ్‌లు గణనీయంగా వేగంగా జమ అవుతున్నాయి. ఇక పన్ను చెల్లింపుదారులకు ఇది ఎంతో ఊరట కలిగించే విషయం. ఈ సంవత్సరం కొంతమంది రిటర్నులు సమర్పించిన కొన్ని గంటల వ్యవధిలోనే రిఫండ్‌లు అందుకున్నట్టు తెలిపారు. కొంతమంది పన్ను చెల్లింపుదారులకు కేవలం నాలుగు గంటల్లోనే రిఫండ్ జమ అవ్వడం విశేషం.
వివరాలు
గతంతో పోలిస్తే గణనీయమైన మార్పు:
సుమారు 12 నుంచి 13 సంవత్సరాల క్రితం ఐటీ రిఫండ్ పొందడానికి కనీసం 90 రోజుల వరకు సమయం తీసుకునేది. కానీ ఇప్పటి డిజిటల్ యుగంలో ప్రాసెసింగ్ వ్యవస్థ పూర్తిగా మారిపోవడంతో అది రోజులు నుంచి గంటల వరకు తగ్గిపోవడం గమనార్హం. నోయిడాకు చెందిన అరుణ్ ప్రకాశ్ అనే వ్యక్తి మాట్లాడుతూ.. "నేను సాయంత్రం 5:30 గంటలకు ఐటీ రిటర్న్ దాఖలు చేశాను.అదే రాత్రి 9:02 గంటలకు రిఫండ్ నా బ్యాంక్ ఖాతాలో జమ అయింది," అని చెప్పారు. ఇందుకు తగిన స్క్రీన్‌షాట్‌ను కూడా ఆయన షేర్ చేశారు.
వివరాలు
ఆదాయపన్ను శాఖ డిజిటల్ సామర్థ్యానికి ప్రత్యక్ష నిదర్శనం
అలాగే, పన్ను నిపుణుడు దీపక్ వర్మ మాట్లాడుతూ.. తనకు చెందిన అనేక మంది క్లయింట్లు ఐటీఆర్ సమర్పించిన అదే రోజు రిఫండ్ అందుకున్నట్టు తెలిపారు. ఇది ఆదాయపన్ను శాఖ డిజిటల్ సామర్థ్యానికి ప్రత్యక్ష నిదర్శనంగా పేర్కొన్నారు. అయితే, ఈ రికార్డు వేగంతో అందరికీ రిఫండ్ వస్తోందా లేదా అన్న అంశంపై మాత్రం ఖచ్చితమైన సమాచారం లేదు.
వివరాలు
రిఫండ్ క్రెడిట్‌లో వేగానికి కారణమిదే..
ఆదాయపన్ను రిటర్నుల ప్రాసెసింగ్, ధ్రువీకరణ పూర్తిగా ఆటోమేటెడ్ వ్యవస్థ ద్వారా జరుగుతోంది. పాత ఎక్సెల్ ఆధారిత వ్యవస్థ స్థానంలో ఇప్పుడు JSON ఫార్మాట్ అమలు కావడం వల్ల డేటా రీడింగ్ వేగవంతమైంది. రిటర్న్‌ను ఈ-వెరిఫై చేసిన వెంటనే రిఫండ్ ప్రాసెసింగ్ ప్రారంభమవుతోంది. బ్యాంక్ ఖాతా ముందస్తు ధృవీకరణ (pre-validation), పాన్-ఆధార్ అనుసంధానం వంటి అంశాలు రిఫండ్ నేరుగా ఖాతాలో జమయ్యేలా చేస్తున్నాయి.
వివరాలు
ఐటీఆర్ దాఖలు విధానం:
ముందుగా ఆదాయపన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్ (incometax.gov.in)లో లాగిన్ అవ్వాలి. తర్వాత 'ఈ-ఫైల్' సెక్షన్‌కి వెళ్లి 'ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్' అనే ఎంపికను ఎంచుకోవాలి. అప్పటి అర్థిక సంవత్సరం (Assessment Year) మరియు అవసరమైన ఫారం (ఉదాహరణకు ITR-1)ను ఎంచుకోవాలి. మీ ఆదాయం, కట్టిన పన్ను వివరాలను ఫారంలో నమోదు చేయాలి. ఫారం సమర్పించిన తర్వాత, తప్పనిసరిగా ఈ-వెరిఫికేషన్ పూర్తి చేయాలి. ఈ-వెరిఫికేషన్ పూర్తయ్యే వరకు రిఫండ్ ప్రాసెసింగ్ మొదలవదు.
వివరాలు
రిఫండ్ స్థితిని ఎలా తెలుసుకోవాలి?
ఆదాయపన్ను శాఖ వెబ్‌సైట్‌లో 'ఈ-ఫైల్' సెక్షన్‌లోకి వెళ్లి 'View Filed Returns' అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అక్కడ మీరు సంబంధించిన అర్థిక సంవత్సరాన్ని (AY) ఎంచుకుని 'View Details' క్లిక్ చేస్తే మీ రిఫండ్ స్థితి కనిపిస్తుంది. ఇతర వివరాల కోసం లేదా మీ రిఫండ్ జాబితాలో ఆలస్యం ఉంటే, ఆదాయపన్ను శాఖ టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్‌ను సంప్రదించవచ్చు.