LOADING...
Niti Aayog: 4 ట్రిలియన్‌ డాలర్ల జీడీపీతో భారత్‌ నాలుగో స్థానం : నీతి ఆయోగ్‌
4 ట్రిలియన్‌ డాలర్ల జీడీపీతో భారత్‌ నాలుగో స్థానం : నీతి ఆయోగ్‌

Niti Aayog: 4 ట్రిలియన్‌ డాలర్ల జీడీపీతో భారత్‌ నాలుగో స్థానం : నీతి ఆయోగ్‌

వ్రాసిన వారు Jayachandra Akuri
May 25, 2025
11:51 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచంలో జపాన్‌ను అధిగమించి భారత్‌ ప్రస్తుతం నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని నీతి ఆయోగ్‌ సీఈఓ బీవీఆర్‌ సుబ్రహ్మణ్యం ప్రకటించారు. దేశ స్థూల దేశీయోత్పత్తి 4 ట్రిలియన్‌ డాలర్లకు చేరుకోవడంతో భారత్‌ నాలుగో స్థానంలో ఉందని తెలిపారు. పదో నీతి ఆయోగ్‌ పాలకమండలి సమావేశం అనంతరం ఆయన మాట్లాడారు. ప్రపంచంలో ఆర్థికంగా ఉన్న అస్థిరతలూ, సవాళ్లూ ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా కొనసాగుతుండడం గమనార్హమని పేర్కొన్నారు. పెట్టుబడులకు గమ్యస్థానంగా భారత్‌ మారడం వల్ల ఈ స్థాయికి చేరగలిగిందని అన్నారు. ప్రస్తుతం అమెరికా, చైనా, జర్మనీ మాత్రమే మనకంటే ముందున్న దేశాలని, ఇలానే కొనసాగితే, మూడేళ్లలో భారత్‌ జర్మనీకూ మించి, మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని బీవీఆర్‌ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు.

Details

భారత్ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర

ఈ లక్ష్య సాధనలో మూలధన వ్యయాలు పెంపు, సులభమైన వ్యాపార నిర్వహణ విధానం, తక్కువ ఖర్చుతో వ్యాపార నిర్వహణ, తయారీలో కార్మికులకు ప్రాధాన్యత, అంతర్జాతీయ మార్కెట్‌పై దృష్టి వంటి అంశాలు కీలకమని పేర్కొన్నారు. వేగంగా విస్తరిస్తున్న దేశీయ డిజిటల్‌ మార్కెట్‌ రాబోయే దశాబ్దంలో భారత ఆర్థిక వ్యవస్థలో కీలకపాత్ర పోషించనుందని తెలిపారు. ఇక మరోవైపు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ ఈ ఘనతపై సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. భారత్‌ వికసిత దేశంగా మారే దిశగా ఇది ఒక గొప్ప అడుగు అని అభివర్ణించారు. ఈ విజయం సాధించడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాత్రను ప్రశంసిస్తూ, ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.