LOADING...
UPI: యూపీఐ లావాదేవీల్లో చారిత్రక రికార్డు.. ఒకే రోజులో తొలిసారిగా 70 కోట్లు దాటిన లావాదేవీలు 
యూపీఐ లావాదేవీల్లో చారిత్రక రికార్డు.. 70 కోట్లు దాటిన లావాదేవీలు

UPI: యూపీఐ లావాదేవీల్లో చారిత్రక రికార్డు.. ఒకే రోజులో తొలిసారిగా 70 కోట్లు దాటిన లావాదేవీలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 05, 2025
05:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల రంగంలో విప్లవాత్మక మార్పులకు దోహదపడుతున్న యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) తన విజయయాత్రలో మరో కీలక మైలురాయిని చేరుకుంది. ఈ ఆగస్టు 2న ఒక్కరోజే 70 కోట్లకు పైగా లావాదేవీలు జరగడంతో,యూపీఐ ఆల్ టైమ్ గరిష్ఠాన్ని నమోదు చేసింది. ఈ ఘనతతో భారత్ ప్రపంచంలోనే రియల్ టైమ్ చెల్లింపుల రంగంలో అగ్రస్థానంలో నిలిచింది. గత కొన్ని నెలలుగా యూపీఐ వినియోగం గణనీయంగా పెరుగుతూ వస్తోంది. జూన్ నెలలో రోజుకి సగటున 62.8 కోట్ల లావాదేవీలు జరిగాయి. కేవలం కొన్ని వారాల్లోనే ఈ సంఖ్య 70కోట్లకు దాటడం ఎంతో ఆశ్చర్యకరం. జులై నెల మొత్తంలో 1947 కోట్ల లావాదేవీలు నమోదవ్వగా,వీటి మొత్త విలువ రూ.25.1 లక్షల కోట్లకు చేరుకుంది.

వివరాలు 

100 కోట్ల లావాదేవీల దిశగా లక్ష్యంగా ఎన్‌పీసీఐ 

గత ఏడాదితో పోలిస్తే లావాదేవీల పరిమాణంలో 35 శాతం, మొత్తం విలువలో 22 శాతం పెరుగుదల కనిపించింది. భవిష్యత్తులో రోజుకు 100 కోట్ల లావాదేవీలను సాధించడం లక్ష్యంగా తీసుకున్నట్టు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) వెల్లడించింది. వినియోగదారులకు సులభంగా ఉపయోగపడే విధానం, వ్యాపార వర్గాల నుంచి లభిస్తున్న విశేష స్పందన ఈ వృద్ధికి ప్రాధాన్యమైన కారణాలుగా ఎన్‌పీసీఐ చెబుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 49.1 కోట్ల మంది వ్యక్తిగత వినియోగదారులు, 6.5 కోట్ల మంది వ్యాపారులు యూపీఐ సేవలను వినియోగిస్తున్నట్లు సమాచారం.

వివరాలు 

ఉచిత సేవలకు ముగింపు సంకేతాలు? 

యూపీఐ సేవలు విస్తృతంగా ఉచితంగానే అందుబాటులో ఉన్నా,ఇటీవల జరిగిన ఒక పరిణామం ఉచిత సేవల భవితవ్యంపై చర్చలకు దారితీసింది. ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ ఐసీఐసీఐ బ్యాంక్ ఆగస్టు 1 నుండి పేమెంట్ అగ్రిగేటర్లపై ఛార్జీలను విధించడం ప్రారంభించింది. ఫోన్‌ పే, గూగుల్ పే వంటి డిజిటల్ చెల్లింపు ప్లాట్‌ఫారాలు ద్వారా జరిగే వ్యాపార లావాదేవీలపై ఈ ఛార్జీలు వర్తించనున్నాయి. ప్రస్తుతం ఈ ఛార్జీల భారాన్ని వినియోగదారులపై నేరుగా మోపడం జరుగకపోయినా,ఈ చర్య పేమెంట్ సేవలందించే సంస్థల ఆర్థిక విధానాలపై ప్రభావం చూపుతుందని పరిశ్రమ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంతేగాక, ఐసీఐసీఐ మాదిరిగానే ఇతర ప్రైవేట్ బ్యాంకులు కూడా ఈ దిశగా అడుగులు వేయనున్నట్టు సూచనలు ఉన్నాయి.