Page Loader
IND-USA: జూలై 8లోగా అమెరికా,భారత్ వాణిజ్య ఒప్పందం
జూలై 8లోగా అమెరికా,భారత్ వాణిజ్య ఒప్పందం

IND-USA: జూలై 8లోగా అమెరికా,భారత్ వాణిజ్య ఒప్పందం

వ్రాసిన వారు Sirish Praharaju
May 22, 2025
08:31 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్ పై అమెరికా 26 శాతం ప్రతీకార సుంకాలు విధించిన నేపథ్యంలో,ఆ దేశం వాటి అమలును 90 రోజుల పాటు వాయిదా వేసింది. అయితే,ఈ విరామం ముగిసిన తర్వాత మాత్రం సుంకాలను అమలు చేయడం ఖాయమని, ఎలాంటి దేశానికి మినహాయింపు ఉండదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తేల్చిచెప్పారు. ఈపరిణామాల నేపథ్యంలో అనేక దేశాలు అమెరికాతో ఈ సుంకాలపై చర్చలు జరుపుతున్నాయి. భారత్ కూడా గత కొంత కాలంగా ఈ టారీఫ్‌ల నుంచి పూర్తిగా మినహాయింపు ఇవ్వాలని అమెరికాను కోరుతూ వస్తోంది. ఈఅంశంపై త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. జూలై 8 నాటికి ఇరుదేశాల మధ్య ఒక మధ్యంతర వాణిజ్య ఒప్పందాన్ని ప్రకటించే అవకాశం ఉందని ఒక సీనియర్ అధికారి వెల్లడించారు.

వివరాలు 

జూలై 8 లోపు మధ్యంతర ఒప్పందం రావొచ్చని సంకేతాలు 

అయితే, అమెరికా 26 శాతం ప్రతీకార సుంకాల్ని తాత్కాలికంగా నిలిపినప్పటికీ, 10 శాతం ప్రాథమిక సుంకం మాత్రం యథావిధిగా అమలవుతోంది. భారత్,అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందానికి సంబంధించి తొలి దశను వేగంగా ముందుకు తీసుకెళ్లే క్రమంలో,అమెరికా వాణిజ్య మంత్రితో మంచి చర్చలు జరిగాయని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయెల్ తెలిపారు. వాషింగ్టన్‌లో యుఎస్ ట్రేడ్ రెప్రెజెంటేటివ్ జేమిసన్ గ్రీర్, అమెరికా వాణిజ్య మంత్రి హోవర్డ్ లుత్నిక్‌లతో గోయల్ సమావేశమయ్యారు. ఈ చర్చలు సానుకూలంగా సాగినట్టు గోయల్ పేర్కొన్నారు.జూలై 8 నాటికి ఒక ఒప్పందానికి చేరుకుంటామని స్పష్టంగా వెల్లడించారు. భారత్ ఉత్పత్తులపై 26శాతం ప్రతీకార సుంకాలు,అలాగే ప్రాథమికంగా అమలవుతున్న 10 శాతం సుంకం నుంచి మినహాయింపు కల్పించేందుకు కృషి చేస్తున్నట్టు ఆయన తెలిపారు.

వివరాలు 

ఎవరెవరు ఏమి కోరుతున్నారు? 

అంతేకాకుండా, టారీఫేతర అంశాలు, డిజిటల్ సేవలు, ఎగుమతి-దిగుమతులకు సంబంధించిన ఇతర విషయాలు కూడా చర్చల్లో భాగమయ్యాయని తెలుస్తోంది. భారతదేశం - జౌళి ఉత్పత్తులు, రత్నాభరణాలు, తోలు వస్తువులు, గార్మెంట్లు, ప్లాస్టిక్ వస్తువులు, రసాయనాలు, రొయ్యలు, నూనె గింజలు, ద్రాక్ష, అరటిపళ్లపై విధించిన సుంకాలను తగ్గించాలని కోరుతోంది. అమెరికా - పారిశ్రామిక వస్తువులు, వాహనాలు, వైన్, పెట్రో రసాయన ఉత్పత్తులు, డెయిరీ ఉత్పత్తులు, వ్యవసాయ సంబంధిత వస్తువులు, జన్యుమార్పిడి పంటలపై విధిస్తున్న సుంకాల తగ్గింపుని కోరుతోంది.