
India-US: భారత్,అమెరికా మొదటి దశ వాణిజ్య ఒప్పందంపై త్వరితగతిన అడుగులు
ఈ వార్తాకథనం ఏంటి
భారత్,అమెరికా దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (BTA) తొలి దశను వేగంగా పూర్తి చేయడానికి ఇరుదేశాలు చర్చలను మరింత వేగవంతం చేశాయి.
ఈ నేపథ్యంలో, కేంద్ర వాణిజ్య,పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్‌తో సమావేశమయ్యారు.
ఈ భేటీలో మొదటి దశ ఒప్పందాన్ని త్వరితంగా పూర్తిచేయాలనే దిశగా ఫలప్రదమైన చర్చలు జరిగాయని గోయల్ ఎక్స్ (పూర్వం ట్విట్టర్) వేదికగా తెలిపారు.
ఈ మంత్రుల స్థాయి చర్చల అనంతరం,ఇరుదేశాల ప్రధాన చర్చాకర్తల మధ్య సమావేశాలు ఈ నెల 22వ తేదీ వరకు జరగనున్నాయి.
వచ్చే సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి తొలి దశ ఒప్పందాన్ని ఖరారు చేయాలన్నదే ఇరుపక్షాల లక్ష్యం.
వివరాలు
పలు కీలక రంగాల్లో సుంకాల నుంచి మినహాయింపు కోరిన భారత్
ఈ చర్చలలో ప్రధానంగా పరస్పర మార్కెట్ల ప్రాప్తి, స్థానిక చట్టాల అమలు, టారిఫ్ మినహాయింపులకు సంబంధించి పరిమితులపై చర్చలు జరగనున్నాయి.
ఈ ఒప్పందంలో భాగంగా భారత్ పలు కీలక రంగాల్లో సుంకాల నుంచి మినహాయింపు కోరుతోంది.
ఇందులో ముఖ్యంగా టెక్స్‌టైల్స్, రత్నాలు, ఆభరణాలు, దుస్తులు, ప్లాస్టిక్ ఉత్పత్తులు, రసాయనాలు, రొయ్యలు, నూనె గింజలు, ద్రాక్ష, అరటిపండ్ల వంటివి ఉన్నాయి. ఇదే సమయంలో, అమెరికా కూడా కొన్ని పారిశ్రామిక ఉత్పత్తులు, ఆటోమొబైళ్లలో (ప్రధానంగా ఎలక్ట్రిక్ వాహనాలు), వైన్స్, పెట్రోకెమికల్స్, పాడి ఉత్పత్తులపై సుంకాల్లో తగ్గింపును కోరుతోంది.
వివరాలు
యథాతథంగా 10 శాతం బేస్‌లైన్ సుంకం
ఈ ఒప్పందానికి సంబంధించి ఇరుదేశాలు కొన్ని నిబంధనలను ఇప్పటికే ఖరారు చేశాయి.
ఇందులో సుంకాలు, వస్తువుల, సేవల పరస్పర మార్పిడి, సుంకేతర అడ్డంకులు, కస్టమ్స్ వ్యవహారాలు వంటి అంశాలు చర్చకు వస్తున్నాయి.
ఇప్పటికే అమెరికా, భారత్‌పై విధించిన అదనపు 26 శాతం సుంకాలను జూలై 9వ తేదీ వరకు తాత్కాలికంగా నిలిపివేసిన నేపథ్యంలో, ఈ 90 రోజుల గడువును సద్వినియోగం చేసుకుంటూ చర్చలను పురోగతిలోకి తీసుకెళ్లాలని ఇరుదేశాలు సంకల్పించాయి.
అయితే ప్రస్తుతం 10 శాతం బేస్‌లైన్ సుంకం యథాతథంగా కొనసాగుతోంది.
వాణిజ్య లోటును నియంత్రించేందుకు టారిఫ్ చర్యలు తీసుకుంటున్నట్టు అమెరికా గత ఏప్రిల్ 2న ప్రకటించిన సంగతి తెలిసిందే.