LOADING...
Stock Market: టారిఫ్‌ భయాలతో నష్టాల బాటలోకి దేశీయ మార్కెట్ సూచీలు 
టారిఫ్‌ భయాలతో నష్టాల బాటలోకి దేశీయ మార్కెట్ సూచీలు

Stock Market: టారిఫ్‌ భయాలతో నష్టాల బాటలోకి దేశీయ మార్కెట్ సూచీలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 05, 2025
04:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం (ఆగస్టు 5) లాభాల మార్గాన్ని వదిలి నష్టాలను ఎదుర్కొన్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ భారత దిగుమతులపై అధిక సుంకాల విధింపు హెచ్చరికల నేపథ్యంలో పెట్టుబడిదారుల్లో ఆందోళన నెలకొంది. దీనికితోడు, రిజర్వ్‌ బ్యాంక్‌ ద్రవ్య పరపతి విధాన సమీక్షకు ముందు సెంటిమెంట్‌ నెగటివ్‌గా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో ట్రేడింగ్‌ సమయమంతా మార్కెట్‌ ఒత్తిడిలో కొనసాగింది. దీంతో సెన్సెక్స్‌ 300 పాయింట్లకుపైగా పడిపోయింది. నిఫ్టీ కూడా 24,700 స్థాయిని కోల్పోయింది.

వివరాలు 

నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్‌

ఉదయం 80,946.43 వద్ద నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ రోజంతా హెచ్చుతగ్గులతో కొనసాగింది. ఒక దశలో ఈ సూచీ 80,554 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. చివరకు 308.47 పాయింట్ల నష్టంతో 80,710.25 వద్ద సెషన్‌ ముగిసింది. నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ సూచీ నిఫ్టీ కూడా 24,590 నుండి 24,733 మధ్య ఊగిసలాడింది. ట్రేడింగ్‌ ముగిసే సమయానికి నిఫ్టీ 73.20పాయింట్లు కోల్పోయి 24,649.55 వద్ద స్థిరపడింది. టారిఫ్‌ ప్రభావంతో పాటు ముడిచమురు ధరలు పెరగడంతో రూపాయి మారకం విలువ మరింత బలహీనపడింది. మంగళవారం ట్రేడింగ్‌ ముగిసే సమయానికి రూపాయి డాలర్‌తో పోల్చితే 15 పైసలు కోల్పోయి 87.81 వద్ద ముగిసింది. ఈ రోజు ట్రేడింగ్‌లో నిఫ్టీలోని ప్రధాన కంపెనీలు నష్టాలను ఎదుర్కొన్నాయి.

వివరాలు 

మార్కెట్‌ పతనానికి కారణాలివే.. 

ముఖ్యంగా ఇన్ఫోసిస్‌, భారత్‌ ఎలక్ట్రానిక్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేర్లు గణనీయంగా క్షీణించాయి. ట్రంప్‌ హెచ్చరికలు: రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తే భారత్‌పై మరిన్ని టారిఫ్‌లు విధిస్తానన్న ట్రంప్‌ వ్యాఖ్యలు పెట్టుబడిదారుల మనోభావాలను దెబ్బతీశాయి. ఎఫ్‌ఐఐల అమ్మకాలు: విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల (FII) అమ్మకాలు కొనసాగుతున్నాయి. సోమవారం ఒక్కరోజే వారు ₹2,566.51 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. చమురు, గ్యాస్‌ రంగ షేర్లు: ట్రంప్‌ టారిఫ్‌ల భయాలతో చమురు, సహజ వాయు రంగానికి చెందిన షేర్లు దాదాపు 1 శాతం వరకూ పడిపోయాయి.

వివరాలు 

ఆర్‌బీఐ సమీక్ష అంచనాలు: 

బుధవారం వెలువడనున్న రిజర్వ్‌ బ్యాంక్‌ ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలపై మదుపర్లలో ఉత్కంఠ నెలకొంది. రిటైల్‌ ద్రవ్యోల్బణం కొంత మేర తగ్గినప్పటికీ, వడ్డీ రేట్ల తగ్గింపుపై ఆర్‌బీఐ ఆచితూచి వ్యవహరించవచ్చన్న సంకేతాలు పెట్టుబడిదారుల భావోద్వేగాలపై ప్రభావం చూపుతున్నాయి.