Stock Market: మదుపర్ల కొనుగోళ్ల జోరు.. లాభాల బాట పట్టిన స్టాక్ మార్కెట్లు
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి.
ప్రారంభంలో కొంతకాలం నష్టాల్లో ట్రేడైనప్పటికీ, మదుపర్ల కొనుగోళ్లతో మార్కెట్లు మళ్లీ లాభాల బాట పట్టాయి.
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు వచ్చినా బ్యాంకింగ్, ఆటో, ఎనర్జీ రంగాల షేర్లకు మద్దతు లభించడంతో సూచీలు నిలకడగా ట్రేడవుతున్నాయి.
ఉదయం 9:35 గంటల సమయంలో సెన్సెక్స్ 332 పాయింట్లు పెరిగి 76,666 వద్ద, నిఫ్టీ 91 పాయింట్ల లాభంతో 23,177 వద్ద ట్రేడవుతున్నాయి.
సెన్సెక్స్ 30 సూచీలో ఎన్టీపీసీ, ఇండస్‌ఇండ్ బ్యాంక్, జొమాటో, అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, ఎస్‌బీఐ, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, మారుతీ సుజుకీ వంటి కంపెనీలు లాభాల్లో ఉన్నాయి.
Details
నష్టాల్లో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, హెచ్‌యూఎల్
అయితే హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, హెచ్‌యూఎల్, టెక్ మహీంద్రా, టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి టెక్ రంగ షేర్లు నష్టాలను చవిచూశాయి.
మార్కెట్లు పెరగడానికి రిటైల్ ద్రవ్యోల్బణం నాలుగు నెలల కనిష్ఠానికి దిగిరావడం కీలక కారణమని నిపుణులు చెబుతున్నారు.
అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 80.75 డాలర్ల వద్ద, బంగారం ఔన్సు 2,686 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి.
డాలర్‌తో రూపాయి మారకం విలువ 86.50 వద్ద కొనసాగుతోంది. అమెరికా మార్కెట్లు సోమవారం మిశ్రమంగా ముగియగా, ఆసియా-పసిఫిక్ మార్కెట్లు అదే ధోరణిలో ట్రేడవుతున్నాయి.
షాంఘై, హాంగ్‌సెంగ్ సూచీలు 1 శాతం లాభాల్లో ఉండగా, జపాన్ నిక్కీ మాత్రం నష్టాల్లో ట్రేడవుతోంది.
Details
నికరంగా రూ.8,066 కోట్ల షేర్ల కొనుగోలు
విదేశీ సంస్థాగత మదుపర్లు సోమవారం నికరంగా రూ.4,893 కోట్ల షేర్లను విక్రయించారు.
అయితే దేశీయ సంస్థాగత మదుపర్లు అదే సమయంలో నికరంగా రూ.8,066 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు.
FIIs విక్రయాలు కొనసాగుతున్నా, DIIs కొనుగోళ్ల మద్దతుతో మార్కెట్లు నిలకడగా ట్రేడవుతున్నాయి.