
Upcoming IPOs: దలాల్ స్ట్రీట్‌లో ఐపీఓల హడావిడి.. వచ్చే వారంలో 4 కొత్త సబ్‌స్క్రిప్షన్లు!
ఈ వార్తాకథనం ఏంటి
దలాల్ స్ట్రీట్‌లో ఐపీఓల హడావిడి మళ్లీ మొదలైంది. వచ్చే వారంలో నాలుగు కంపెనీలు తమ పబ్లిక్ ఇష్యూలను ప్రారంభించనున్నాయి.
అయితే ఇవన్నీ ఎస్‌ఎంఈ విభాగానికి చెందినవే కావడం గమనార్హం.
ప్రధాన బోర్డుకు చెందిన ఏ కంపెనీ కూడా ఈసారి ఐపీఓకు రాలేదు. ఇదే సమయంలో ఇప్పటికే మార్కెట్ ద్వారా నిధులు సమీకరించిన ఐదు కంపెనీలు స్టాక్ మార్కెట్లో లిస్ట్ కానున్నాయి.
Details
శ్రీ అహింస నేచురల్స్
శ్రీ అహింస నేచురల్స్ (Shri Ahimsa Naturals) ఐపీఓ మార్చి 25న ప్రారంభమై 27న ముగుస్తుంది. ఈ సంస్థ మొత్తం రూ.73.81 కోట్ల నిధులు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఇందులో భాగంగా 42.04 లక్షల తాజా షేర్లను జారీ చేయనుండగా, 19.99 లక్షల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా విక్రయించనుంది. ధర శ్రేణిని రూ.113-119గా నిర్ణయించింది.
ఏప్రిల్ 1న ఈ షేర్లు స్టాక్ మార్కెట్లో లిస్ట్ కానున్నాయి. సమీకరించిన నిధులను వ్యాపార విస్తరణకు వినియోగించనుంది.
ఈ సంస్థ గ్రీన్ కాఫీ బీన్స్, గ్రీన్ టీ వంటి ఉత్పత్తులను దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లకు సరఫరా చేస్తోంది.
Details
ఏటీసీ ఎనర్జీ సిస్టమ్
ఇతర ఎస్‌ఎంఈ విభాగం నుంచి ఐపీఓకు వస్తున్న సంస్థల్లో ఏటీసీ ఎనర్జీ సిస్టమ్ (ATC Energy Systems) కూడా ఒకటి.
ఈ కంపెనీ పబ్లిక్ ఇష్యూలో భాగంగా రూ.63.76 కోట్లు సమీకరించనుంది.
ఇందులో 43.24 లక్షల తాజా షేర్లు, ఆఫర్ ఫర్ సేల్ ద్వారా 10.80 లక్షల షేర్లు జారీ చేయనుంది. ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ మార్చి 25న ప్రారంభమై 27న ముగుస్తుంది.
కంపెనీ షేర్ల ధర శ్రేణిని రూ.112-118గా నిర్ణయించింది. లిథియం-అయాన్ బ్యాటరీల ఉత్పత్తిలో ముందున్న ఈ సంస్థ ఇంధన రంగంలో కీలక స్థానాన్ని ఆక్రమించింది.
Details
డెస్కో ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్
డెస్కో ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్ (Desco Infratech Ltd) ఐపీఓ ఎస్‌ఎంఈ విభాగం నుంచి మార్కెట్‌లోకి రానుంది.
ఈ సంస్థ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్, రెన్యూవబుల్ ఎనర్జీ, వాటర్ అండ్ పవర్ వంటి విభాగాల్లో ఇంజినీరింగ్, ప్లానింగ్, కన్‌స్ట్రక్షన్ సేవలను అందిస్తోంది. ఐపీఓ ద్వారా రూ.30.75 కోట్లు సమీకరించనుంది.
20.50 లక్షల తాజా షేర్లను జారీ చేయనుంది. షేర్ల ధర శ్రేణి రూ.147-150గా నిర్ణయించింది.
మార్చి 24న సబ్‌స్క్రిప్షన్ ప్రారంభమై, మార్చి 26న ముగుస్తుంది. ఏప్రిల్ 1న ఈ కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ కానుంది.
Details
ఐడెంటిక్స్‌వెబ్
ఐడెంటిక్స్‌వెబ్ (Identixweb) కంపెనీ ఐపీఓ ద్వారా రూ.16.63 కోట్లు సమీకరించనుంది. కంపెనీ షేర్ల ధర శ్రేణిని రూ.51-54గా నిర్ణయించింది.
మార్చి 26న ప్రారంభమై 28న సబ్‌స్క్రిప్షన్ ముగుస్తుంది. ఇందులో భాగంగా 30.80 లక్షల షేర్లను జారీ చేయనుంది.
లిస్టింగ్‌కు సిద్ధమైన కంపెనీలు
మార్చి 24న డివైన్ హీరా జ్యువెలర్స్, పరదీప్ పరివాహన్ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ కానున్నాయి. మార్చి 27న గ్రాండ్ కాంటినెంట్ హోటల్స్, మార్చి 28న యాక్టివ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ర్యాపిడ్ ఫ్లీట్ స్టాక్ మార్కెట్లో ప్రవేశించనున్నాయి.
దలాల్ స్ట్రీట్‌లో ఎస్‌ఎంఈ విభాగం నుంచి వస్తున్న ఈ ఐపీఓల సందడి పెట్టుబడిదారుల ఆసక్తిని పెంచుతోంది.