Page Loader
Jane Street:  స్టాక్‌ మార్కెట్‌లోకి మళ్లీ ప్రవేశించేందుకు జేన్‌ స్ట్రీట్‌కు సెబీ అనుమతి 
స్టాక్‌ మార్కెట్‌లోకి మళ్లీ ప్రవేశించేందుకు జేన్‌ స్ట్రీట్‌కు సెబీ అనుమతి

Jane Street:  స్టాక్‌ మార్కెట్‌లోకి మళ్లీ ప్రవేశించేందుకు జేన్‌ స్ట్రీట్‌కు సెబీ అనుమతి 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 21, 2025
02:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలోని ప్రముఖ హెడ్జ్‌ ఫండ్‌ సంస్థ జేన్‌ స్ట్రీట్‌పై దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో అక్రమ పద్ధతులతో వేల కోట్ల రూపాయలు ఆర్జించిన నేపథ్యంలో సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజీ బోర్డు ఆఫ్‌ ఇండియా (సెబీ)విధించిన నిషేధాన్ని ఎత్తివేసింది. రూ.4,800కోట్ల జరిమానా మొత్తాన్ని ఎస్క్రో ఖాతాలో డిపాజిట్‌ చేసిన నేపథ్యంలో సెబీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. దీంతో జేన్‌ స్ట్రీట్‌కు స్టాక్‌ మార్కెట్‌లో మళ్లీ రీఎంట్రీకి మార్గం సుగమమైంది. జేన్‌ స్ట్రీట్‌పై ఉన్న నిషేధం ఎత్తివేసిన విషయం గురించి ఆ సంస్థతో పాటు స్టాక్‌ ఎక్స్ఛేంజీలు, డిపాజిటరీలు,కస్టోడియన్లకు సెబీ సమాచారం అందించినట్లు తెలిసింది. జరిమానా మొత్తాన్ని ఎస్క్రో ఖాతాలో జమ చేసిన సమయంలో సంస్థ తమపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని కోరింది.

వివరాలు 

జులై 3న జేన్‌ స్ట్రీట్‌పై సెబీ కఠిన చర్యలు

దీనిని పరిశీలించిన సెబీ నిషేధాన్ని ఎత్తివేయడమే కాకుండా,మార్కెట్‌లో దాని కార్యకలాపాలపై ఎక్స్ఛేంజీలు ఎప్పటికప్పుడు నిఘా పెట్టే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. గతంలో అక్రమ కార్యకలాపాలకు పాల్పడిన నేపథ్యంలో జులై 3న జేన్‌ స్ట్రీట్‌పై సెబీ కఠిన చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. స్టాక్‌ మార్కెట్‌ ద్వారా సంస్థ దాదాపు రూ.44,358 కోట్లు అక్రమంగా సంపాదించినట్లు సెబీ తన విచారణలో నిర్ధారించింది. ఈ సంస్థ స్టాక్‌ ఫ్యూచర్స్‌ విభాగంలో రూ.7,208 కోట్లకు, ఇండెక్స్‌ ఫ్యూచర్స్‌ విభాగంలో రూ.191 కోట్లకు, నగదు విభాగంలో రూ.288 కోట్లకు నష్టం చేకూర్చినట్లు గుర్తించింది.

వివరాలు 

రూ.4,843 కోట్ల జరిమానా

నష్టాలను మినహాయించి, సంస్థ నికరంగా రూ.36,671 కోట్లు అక్రమంగా ఆర్జించినట్లు గుర్తించడంతో రూ.4,843 కోట్లను జరిమానాగా చెల్లించాలని సెబీ ఆదేశించింది. దేశీయ స్టాక్‌మార్కెట్‌ చరిత్రలో ఇంత పెద్ద మొత్తాన్ని జరిమానాగా విధించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. గత వారం రోజులలో జేన్‌ స్ట్రీట్‌ ఈ మొత్తాన్ని ఎస్క్రో ఖాతాలో డిపాజిట్‌ చేసింది.