Page Loader
Jeff Bezos: $737 మిలియన్ల విలువైన అమెజాన్ షేర్లను విక్రయించిన జెఫ్ బెజోస్ 
$737 మిలియన్ల విలువైన అమెజాన్ షేర్లను విక్రయించిన జెఫ్ బెజోస్

Jeff Bezos: $737 మిలియన్ల విలువైన అమెజాన్ షేర్లను విక్రయించిన జెఫ్ బెజోస్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 02, 2025
09:11 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో ఒకరైన, అమెజాన్‌ స్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ మళ్లీ వార్తల్లోకి ఎక్కారు. ఇటీవల తన ప్రేయసిని వివాహమాడిన ఆయన తాజాగా అమెజాన్‌ సంస్థలో తన వాటాలోని కొన్ని షేర్లను విక్రయించారు. ఈసారి ఆయన అమ్మిన షేర్ల విలువ సుమారు 736.7 మిలియన్‌ డాలర్లు, అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.6,300 కోట్లకు అన్నమాట. మొత్తం 33 లక్షల షేర్లను ఆయన విక్రయించినప్పటికీ, ఆయన నికర ఆస్తి విలువ 241.4 బిలియన్‌ డాలర్లుగా ఉండటంతో, ప్రపంచ సంపన్నుల జాబితాలో మూడో స్థానాన్ని కొనసాగిస్తున్నారు. ఈ సంవత్సరం లో బెజోస్‌ తన షేర్లను విక్రయించడం ఇదే మొదటిసారి.

వివరాలు 

 ట్రేడింగ్‌ ప్రణాళికల ప్రకారం 2.5 కోట్ల షేర్లను విక్రయించాలనే నిర్ణయం 

గతంలో మాదిరిగానే ఈ ఏడాదికిగాను తన ట్రేడింగ్‌ ప్రణాళికల ప్రకారం 2.5 కోట్ల షేర్లను విక్రయించాలనే నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన మార్చి నెలలోనే వెల్లడించారు. ఆప్పటి నుంచి కంపెనీ షేరు ధరల్లో 8 శాతానికి మించి వృద్ధి నమోదైంది. ఇదే తరహాలో గత సంవత్సరం ఆయన 75 మిలియన్ల షేర్లను విక్రయించి దాదాపు 13.6 బిలియన్‌ డాలర్ల మేర ఆదాయం పొందారు. జెఫ్‌ బెజోస్‌ 2002 సంవత్సరం నుంచే ప్రతి ఏడాది తన వాటాలో కొంత మొత్తాన్ని అమ్ముకుంటూ వస్తున్నారు. ఇప్పటివరకు ఆయన విక్రయించిన షేర్ల మొత్తం విలువ సుమారు 44 బిలియన్‌ డాలర్లకు చేరింది.

వివరాలు 

స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా 9,30,000 షేర్లు 

ఈ ఆదాయాన్ని ఆయన ప్రధానంగా తన అంతరిక్ష సంస్థ అయిన బ్లూ ఆర్జిన్‌ కార్యకలాపాల కోసం వినియోగిస్తున్నారు. అంతేకాక, సామాజిక సేవా కార్యక్రమాలకు కూడా తన షేర్లను ఉపయోగిస్తున్నారు. 2025 మొదట్లో ఆయన దాదాపు 9,30,000 షేర్లను స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా అందించారు. ఇతర వివరాలకొస్తే, 61 ఏళ్ల జెఫ్‌ బెజోస్‌ ఇటీవలే తన స్నేహితురాలు లారెన్‌ శాంచెజ్‌ను వివాహమాడారు. ఇటలీలోని వెనిస్‌ నగరంలో జరిగిన ఈ వివాహ వేడుకకు అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు. ఈ వివాహానికి సంబంధించిన ఫొటోలు సోషల్‌మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి.