Page Loader
Banking Laws Amendment Bill: బ్యాంకింగ్‌ చట్టాల్లో కీలక మార్పులు.. ఒక్క ఖాతాకు నలుగురు నామినీలు 
బ్యాంకింగ్‌ చట్టాల్లో కీలక మార్పులు.. ఒక్క ఖాతాకు నలుగురు నామినీలు

Banking Laws Amendment Bill: బ్యాంకింగ్‌ చట్టాల్లో కీలక మార్పులు.. ఒక్క ఖాతాకు నలుగురు నామినీలు 

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 28, 2025
02:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

పార్లమెంట్‌ తాజాగా బ్యాంకింగ్‌ చట్టాల సవరణ బిల్లును 2024ని ఆమోదించింది. డిసెంబరులో లోక్‌సభ ఆమోదించిన ఈ బిల్లుకు రాజ్యసభ కూడా అంగీకారం తెలిపింది. ఈ చట్టం ప్రకారం, ఖాతాదారులు ఒక్కో బ్యాంక్ ఖాతాకు నలుగురు వరకు నామినీలను నియమించుకునే వెసులుబాటు పొందనున్నారు. డిపాజిట్లు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల సమయంలోనే నామినేషన్‌ వివరాలను సమర్పించాలి. లాకర్ల విషయంలోనూ ఇదే విధానం వర్తించనుంది. ఇదివరకే బీమా పాలసీలు, ఇతర ఆర్థిక వ్యవస్థలలో ఈ విధానం అమలులో ఉంది.

Details

సబ్‌స్టాన్షియల్‌ ఇంటరెస్ట్‌ పరిమితి పెంపు 

'సబ్‌స్టాన్షియల్‌ ఇంటరెస్ట్‌' పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.2 కోట్లకు పెంచారు. 60 ఏళ్ల క్రితం నిర్ణయించిన ఈ పరిమితి, ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పెంచినట్లు తెలిపారు. బ్యాంక్‌ వాటా మూలధనంలో 10 శాతం వాటా కలిగిన వ్యక్తిని, కుటుంబాన్ని 'సబ్‌స్టాన్షియల్‌ ఇంటరెస్ట్‌' కలిగిన వారిగా గుర్తిస్తారు. వీరికి రుణాల మంజూరులో ప్రత్యేక నిబంధనలు వర్తిస్తాయి.

Details

ఎగవేతదార్లపై కఠిన చర్యలు

రాజ్యసభలో చర్చ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మాట్లాడుతూ, నిరర్థక ఆస్తులు (NPAs) తగ్గినా, ఉద్దేశపూర్వక ఎగవేతదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గత ఐదేళ్లలో బ్యాంకు మోసాలకు సంబంధించి 912 కేసులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) దర్యాప్తు చేసింది. వీటిలో కొన్ని ఉద్దేశపూర్వక ఎగవేతదారుల కేసులే. రైట్‌-ఆఫ్‌ అంటే రుణ మాఫీ కాదు రుణాలను రైట్‌-ఆఫ్‌ (Write-Off) చేయడం అంటే వాటిని పూర్తిగా మాఫీ చేయడమని భావించకూడదని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. బ్యాంకులు సంబంధితుల నుంచి ఆ నిధులను వసూలు చేసే ప్రక్రియను కొనసాగిస్తాయని తెలిపారు.

Details

యూపీఐ లావాదేవీల్లో అంతరాయం 

బుధవారం దేశవ్యాప్తంగా యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (UPI) సేవల్లో దాదాపు గంట పాటు అంతరాయం ఏర్పడింది. డిజిటల్‌ చెల్లింపుల ప్లాట్‌ఫామ్‌లైన గూగుల్‌ పే, ఫోన్‌పే వినియోగదారులు చెల్లింపులు జరపలేక ఇబ్బంది పడ్డారు. ఇది అరుదుగా తలెత్తే సాంకేతిక లోపం కారణంగా జరిగిందని నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (NPCI) తెలిపింది. ప్రస్తుతం యూపీఐ సేవలు యథావిధిగా అందుబాటులోకి వచ్చాయని వెల్లడించింది.

Details

మార్చి 31న బ్యాంకులు పనిచేస్తాయి 

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) తాజా ఆదేశాల ప్రకారం, మార్చి 31న (ఆదివారం) బ్యాంకులు యధావిధిగా పనిచేయనున్నాయి. ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో ప్రభుత్వ లావాదేవీలను పూర్తి చేయాల్సి ఉండటంతో బ్యాంకులను తెరవాలని నిర్ణయించారు. ఆన్‌లైన్, మొబైల్‌ బ్యాంకింగ్‌ సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. అయితే, ఏప్రిల్‌ 1న వార్షిక ఖాతాల మూసివేత కారణంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది.