Meta Layoffs : మెటాలో మరోసారి లేఆఫ్స్ కలకలం
ఫేస్ బుక్ మాతృసంస్థ మెటా మరోసారి ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆర్థికమాంద్యం ప్రభావంతో ఖర్చు తగ్గింపులో భాగంగా గూగుల్, మైక్రోసాప్ట్, అమెజాన్, ట్విట్టర్, లింక్డిన్, మెటా వంటి టెక్ దిగ్గజాలు ఒకదాని తర్వాత ఒకటి సంస్థలోని ఉద్యోగులను ఇప్పటికే తొలిగించాయి. ఇప్పటికీ కొన్ని కంపెనీలు లేఆఫ్స్ కొనసాగిస్తున్నాయి. అయితే ఈసారి మెటావర్స్ విభాగంలో పనిచేస్తున్న వారిని తొలిగిస్తున్నట్లు సమాచారం. మంగళవారం జరిగిన అంతర్గత చర్చల్లో ఉద్యోగులకు తొలగింపుపై సమాచారం అందించినట్లు సంస్థలోని ఇద్దరు ఉన్నతాధికారులు వెల్లడించినట్లు పలు నివేదికలు తెలిపాయి.
ఇప్పటివరకూ 21 వేల మంది సంస్థ నుంచి తొలగించిన మెటా
మెటా ఇప్పటికే మార్కెటింగ్, సైట్ సెక్యూరిటీ, ఎంటర్‌ప్రైజ్ ఇంజినీరింగ్, ప్రోగ్రాం మేనేజ్‌మెంట్, కంటెంట్ స్ట్రాటజీ, కార్పొరేట్ కమ్యూనికేషన్ సహా పలు విభాగాల్లోని ఉద్యోగులను తొలగించింది. ఈసారి మెటాకు చెందిన ఫాస్ట్ యూనిట్‌లో పనిచేస్తున్న 600 మంది ఉద్యోగులపై ఈ లేఫ్ ప్రభావం ఉండనుంది. గత కొంతకాలంగా మెటా చిప్‌ల తయారీ విభాగంలో సవాళ్లు ఎదుర్కొంటోంది. గతేడాది నవంబర్ నుంచి మెటా ఇప్పటివరకూ 21వేల మందిని సంస్థ నుంచి తప్పించింది. ఈ ఏడాది చివరి వరకు ఉద్యోగుల తొలగింపు ప్రక్రియలు కొనసాగే అవకాశం ఉంటుందని మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ గతంలో వెల్లడించిన సంగతి తెలిసిందే.