Page Loader
Bill Gates: 'హార్వర్డ్‌ను వదిలేయడం బాధ కలిగించింది'.. బిల్ గేట్స్
హార్వర్డ్‌ను వదిలేయడం బాధ కలిగించింది'.. బిల్ గేట్స్

Bill Gates: 'హార్వర్డ్‌ను వదిలేయడం బాధ కలిగించింది'.. బిల్ గేట్స్

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 20, 2025
01:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ తన కాలేజీ జీవితాన్ని గుర్తుచేసుకుంటూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. హార్వర్డ్ యూనివర్సిటీలో చదువును మానేయాలనే నిర్ణయం తీసుకున్నప్పుడు ఎంతో బాధపడినట్లు తెలిపారు. 'సోర్స్‌ కోడ్‌ - మై బిగినింగ్స్‌' అనే పుస్తకంలో తన అనుభవాలను పంచుకున్నారు. హార్వర్డ్‌ రోజులు - ఆనందకరమైన జ్ఞాపకాలు గేట్స్ కళాశాల రోజులను ఎంతో ఆనందంగా గడిపినట్లు గుర్తు చేసుకున్నారు. హార్వర్డ్‌లో చదువుకునే రోజుల్లో మనస్తత్వశాస్త్రం, ఆర్థిక శాస్త్రం, చరిత్ర తరగతులను ఆస్వాదించేవారని చెప్పారు. తెలివైన వాళ్లతో గడిపే సమయాన్ని ఎక్కువగా ఇష్టపడేవారట. రాత్రి వేళల్లో ఆసక్తికరమైన అంశాలపై చర్చలు జరిగేవని తెలిపారు.

Details

 మైక్రోసాఫ్ట్ కోసం హార్వర్డ్‌కు వీడ్కోలు 

1975లో మైక్రోసాఫ్ట్‌ సంస్థను స్థాపించేందుకు హార్వర్డ్‌లో తన చదువును మానేయాల్సి వచ్చిందని బిల్‌ గేట్స్‌ తెలిపారు. అయితే ఈ నిర్ణయం తీసుకోవడం తనకు చాలా బాధను కలిగించిందని చెప్పారు. డిగ్రీ పూర్తి చేసేందుకు తిరిగి హార్వర్డ్‌కు వెళ్లాలనుకున్నప్పటికీ, వచ్చిన అవకాశాన్ని కోల్పోవద్దనే ఉద్దేశంతో తాను, తన స్నేహితుడు పాల్‌ అలెన్‌ కలిసి కళాశాలను విడిచి పెట్టారని వివరించారు. ఆ సమయంలో తాము కంప్యూటర్ల కోసం ఒక ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ను రూపొందించి, కొత్త పరిశ్రమలో ముందంజలో ఉండాలనే లక్ష్యంతో ముందుకు సాగారని చెప్పారు. మొదటి రెండు సంవత్సరాల పాటు మైక్రోసాఫ్ట్‌ నిర్వహణను చూసుకుంటూనే చదువు కొనసాగించేందుకు ప్రయత్నించారని, అయితే చివరికి అది సాధ్యపడలేదని తెలిపారు.

Details

 'సోర్స్ కోడ్' పుస్తకం - మూడు భాగాల్లో బిల్‌ గేట్స్ జీవిత కథ 

'సోర్స్‌ కోడ్‌' పుస్తకాన్ని మూడు భాగాలుగా తీసుకురావాలని నిర్ణయించారు. మొదటి వాల్యూమ్‌లో తన చిన్ననాటి సంగతులు, డ్రగ్స్‌తో చేసిన ప్రయోగాల గురించి మాత్రమే ప్రస్తావించినట్లు తెలిపారు. అయితే తన ఉద్యోగ జీవితం, మైక్రోసాఫ్ట్‌లో అనుభవాలు, మెలిందా గేట్స్‌తో వివాహం, దాతృత్వ కార్యక్రమాల గురించి భవిష్యత్‌లో రానున్న పుస్తకాలలో వివరిస్తానని వెల్లడించారు. కంప్యూటర్ రంగంలో విప్లవాత్మక మార్పులు 2000 వరకు మైక్రోసాఫ్ట్‌ సీఈఓగా కొనసాగిన బిల్‌ గేట్స్‌ తన పదవీకాలంలో కంప్యూటర్ పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు. మైక్రోసాఫ్ట్‌ను ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీల సంస్థగా తీర్చిదిద్దారు. దీంతో ఆయన ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరిగా నిలిచారు.