
Donald Trump: 'ఆపిల్'కు ట్రంప్ వార్నింగ్.. అలాచేస్తే 25% సుంకం చెల్లించాల్సిందే!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఆపిల్ సంస్థపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అమెరికాలో విక్రయించబడే ఐఫోన్లను దేశంలోనే తయారు చేయాలని,భారత్ వంటి ఇతర దేశాల్లో తయారీ చేయొద్దని స్పష్టం చేశారు.
అలా చేస్తే కనీసం 25 శాతం దిగుమతి సుంకాన్ని చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు.
"అమెరికాలో విక్రయించే ఐఫోన్లను యునైటెడ్ స్టేట్స్‌లోనే తయారు చేయాలి.భారత్ లేదా ఇతర దేశాల్లో కాదు.ఈ విషయాన్ని ఇప్పటికే యాపిల్ సీఈఓ టిమ్ కుక్‌కు తెలియజేశాను.అయినా అలా కొనసాగిస్తే, కనీసం 25 శాతం దిగుమతి సుంకం వసూలు చేస్తాం" అని ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక 'ట్రూత్ సోషల్తో' చెప్పారు.
ఈ వ్యాఖ్యల తరువాత ఆపిల్ షేర్లు మూడు శాతం పడిపోయాయని నివేదికలు చెబుతున్నాయి.
వివరాలు
ఆపిల్ భారత్‌లో భారీగా ఉత్పత్తి కార్యక్రమాలు
ఇప్పటికే చైనాపై అమెరికా విధించిన దిగుమతి సుంకాల వల్ల, ఐఫోన్ల తయారీని భారత్‌లో విస్తరించేందుకు యాపిల్ ప్రయత్నాలు చేస్తోంది.
అయితే ఈ నిర్ణయంపై ట్రంప్ సంతృప్తి వ్యక్తం చేయలేదు. ఇటీవల ఖతార్ పర్యటనలో ఉన్న సందర్భంగా, "ఆపిల్ భారత్‌లో భారీగా ఉత్పత్తి కార్యక్రమాలు చేపడుతోంది. ఇది నాకు ఇష్టం లేదు" అని ఆయన వ్యాఖ్యానించారు.
తాజగా మరోసారి ఇదే అంశాన్ని ప్రస్తావించిన ట్రంప్, అమెరికాలో తయారీ జరగకపోతే, యాపిల్ తప్పనిసరిగా దిగుమతి సుంకాలు చెల్లించాల్సి వస్తుందని అన్నారు.
వివరాలు
ఈయూ దేశాలపై 50శాతం సుంకం
అంతేకాక, ట్రంప్ యూరోపియన్ యూనియన్ (ఈయూ) దేశాలపై సైతం దిగుమతి సుంకాలపై దండయాత్ర ప్రకటించారు.
ఈయూ దేశాలపై 50 శాతం దిగుమతి సుంకాలు విధించనున్నట్లు, ఇది జూన్ 1వ తేదీ నుండి అమల్లోకి వస్తుందని తెలిపారు.
ఈయూతో జరిగిన చర్చలు విజయవంతం కాలేదని, ఆ చర్చలు నిలిచిపోయిన నేపథ్యంలోనే ఈ చర్య తీసుకుంటున్నట్లు వివరించారు.