PM E-DRIVE: పీఎం ఇ- డ్రైవ్ పథకం ద్వారా టూ వీలర్‌కు గరిష్ఠంగా రూ.10 వేలు సబ్సిడీ
పరిసరాలను శుభ్రంగా ఉంచడంతో పాటు విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం ఇ-డ్రైవ్ (PM E-DRIVE) పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ పథకం ద్వారా విద్యుత్ వాహనాలకు అవసరమైన ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు పెంచడమే లక్ష్యంగా పెట్టుకుంది. దిల్లీలో భారత్ మండపంలో ఈ పథకం ప్రారంభోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి, సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ పాల్గొననున్నారు.
పీఎం ఇ-డ్రైవ్ పథకం కోసం రూ.10,900 కోట్లు
పీఎం ఇ-డ్రైవ్ పథకం కోసం రూ.10,900 కోట్లు కేటాయించినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఇది 2024 అక్టోబర్ 1 నుంచి 2026 మార్చి 31 వరకు అమల్లో ఉంటుందని గెజిట్ నోటిఫికేషన్ ద్వారా తెలిపింది. ఈ పథకం కింద విద్యుత్ టూ వీలర్లు, త్రీవీలర్లు, ఇ-అంబులెన్సులు, ఇ-ట్రక్కులకు కేంద్రం రాయితీలను అందించనుంది. పథకం అమలులో ఉన్న కాలంలో బస్సులకు రూ.4,391 కోట్లు, టూవీలర్లకు రూ.1,772 కోట్లు చెల్లించాలని నిర్ణయించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ టూవీలర్, త్రీవీలర్ కేటగిరీలకు కిలోవాట్‌కు రూ.5000, మరుసటి ఏడాది రూ.2,500 చొప్పున రాయితీ ఇస్తారు.
ఇ-రిక్షాలకు రూ.25 వేలు రాయితీ
టూవీలర్‌కి గరిష్ఠంగా రూ.10 వేలు, ఇ-రిక్షాలకు రూ.25 వేలు రాయితీ లభించనుంది. 2025-26లో టూవీలర్‌లకు రూ.5 వేలు, ఇ-రిక్షాలకు రూ.12,500 వరకు రాయితీ ఇవ్వనున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు కేంద్రం ఇప్పటికే ఫేమ్-1, ఫేమ్-2 పథకాలను అమలు చేసిన విషయం తెలిసిందే. 2015లో ప్రారంభించిన ఫేమ్-1 పథకం తర్వాత, 2019లో రూ.11,500 కోట్లతో ఫేమ్-2 పథకాన్ని తీసుకొచ్చారు. ఇది 2024 మార్చి 31 వరకు అమల్లో ఉంటుంది. 'పీఎం ఇ-డ్రైవ్' పథకం విద్యుత్ వాహన రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.