Meta layoffs: వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఉద్యోగాల కోత.. ది వెర్జ్ నివేదిక
టెక్ రంగంలో ఉద్యోగాల కోత కొనసాగుతూనే ఉంది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ మాతృసంస్థ మెటా (Meta) మరింత మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. దీర్ఘకాలిక వ్యూహాత్మక లక్ష్యాలను సాధించడానికి సంబంధించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. లేఆఫ్‌ల గురించి కంపెనీ ధ్రువీకరించినప్పటికీ, ఎంత మంది ఉద్యోగులను తొలగిస్తుందనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.
ఉద్యోగులకు ప్రత్యామ్నాయ అవకాశాలు
మెటా పరిధిలో ఉన్న వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, వర్చువల్ రియాలిటీపై పనిచేసే రియాలిటీ ల్యాబ్ వంటి అన్ని వ్యాపారాల్లో ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకునే కార్యక్రమం జరుగుతున్నట్లు తెలుస్తోంది. రిక్రూటింగ్, లీగల్ ఆపరేషన్స్, డిజైన్ తదితర విభాగాల్లో పనిచేసే ఉద్యోగులపై ఈ ప్రభావం పడనుంది. "మేము దీర్ఘకాలిక వ్యూహాత్మక లక్ష్యాలు, ప్రాంతీయ వ్యూహాల్లో మార్పులు చేస్తున్నాము" అని మెటా అధికారిక ప్రతినిధి తెలిపారు. ఈ క్రమంలోనే ఈ తొలగింపులు చేపడుతున్నట్లు వెల్లడించారు. అయితే, మెటా నుండి బయటకు వెళ్లిన ఉద్యోగులకు ప్రత్యామ్నాయ అవకాశాలను అందించడానికి కంపెనీ ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు.
2022లో మెటా 11,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన
2022లో మెటా 11,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. గత సంవత్సరంలో మరో 10,000 మందిని ఇంటికి పంపించింది. ప్రస్తుతం మరో రౌండ్ లేఆఫ్‌లకు సిద్ధమైంది. అయితే, ఈసారి తొలగింపులు తక్కువ సంఖ్యలో ఉండనున్నాయని సమాచారం. ఇప్పటికే మెటా నుండి లేఆఫ్‌కు గురైన కొందరు ఉద్యోగులు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో, టెక్ కంపెనీలు ఆర్థిక ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నాయి. సైబర్ సెక్యూరిటీపై పెట్టుబడులు పెడుతున్నాయి, అలాగే ఏఐ సాంకేతికతను అందిపుచ్చుకోవడంపై పెద్ద ఎత్తున పెట్టుబడులు వేస్తున్నాయి. ఖర్చులను తగ్గించుకునేందుకు ప్రయత్నంలో భాగంగా ఉద్యోగులను తొలగిస్తున్నారు.
ఇంటెల్ 15 శాతం మంది ఉద్యోగులను తగ్గించింది
ఇప్పటికే ఇంటెల్ (Intel), సిస్కో (Cisco), ఐబీఐ (IBM) వంటి కంపెనీలు పెద్ద సంఖ్యలో ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇంటెల్ 15 శాతం మంది ఉద్యోగులను తగ్గించింది. ఈ ఏడాది ఆగస్టు నాటికి 422 కంపెనీలు ఏకంగా 1,36,000 మందిని తొలగించినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.