Page Loader
సోషల్ మీడియా దిగ్గజం మెటాకు కీలక మార్కెట్‌గా భారత్‌ 
సోషల్ మీడియా దిగ్గజం మెటాకు కీలక మార్కెట్‌గా భారత్‌

సోషల్ మీడియా దిగ్గజం మెటాకు కీలక మార్కెట్‌గా భారత్‌ 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Sep 06, 2023
10:48 am

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశంలో తమకు అపరిమిత అవకాశాలు ఉన్నాయని ప్రముఖ సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ భావిస్తోంది. ఈ మేరకు స్థూల ఆర్థిక వృద్ధి, డిజిటల్‌ మౌలిక సదుపాయాలు తదితర అంశాల్లో దేశం మెరుగ్గా ఉందని భారత మెటా అధిపతి సంధ్య దేవనాథన్‌ అభిప్రాయపడ్డారు. మరోవైపు ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి తమ యాప్స్‌ భారత్‌లో గణనీయంగా ప్రాచుర్యం పొందుతున్నట్లు గుర్తించామన్నారు. ఈ నేపథ్యంలోనే భారత్‌ను కీలక మార్కెట్‌గా పరిగణిస్తున్నట్లు సంధ్య చెప్పుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా రూపొందించిన డిజిటల్‌ వ్యక్తిగత డేటా భద్రత చట్టం(DIGITAL PRIVACY DATA PROTECTION ACT)తో యూజర్ల వివరాల గోప్యతను పాటించేందుకు వీలు కలిగిందన్నారు. అంతేకాకుండా కొత్త ఆవిష్కరణలు చేస్తూ సమతూల్యం పాటించేందుకు టెకీలకు స్పష్టత దొరికిందని వివరించారు.

DETAILS

భారత్‌లో 40 కోట్ల మందిపైగా వినియోగదారులున్నారు : భారత హెడ్ సంధ్య

మెటా, వాట్సాప్ సహా ఇన్‌స్టాగ్రామ్‌ వంటి తమ గ్రూప్ ప్లాట్‌ఫామ్‌పై తప్పుడు సమాచారం, విద్వేషపూరిత కంటెంట్‌ని నియంత్రించేందుకు కృత్రిమ మేధస్సు(ARTIFICIAL INTELLIGENCE)ను సమర్థంగా వినియోగించేందుకు కృషి చేస్తున్నట్లు భారత మెటా అధిపతి సంధ్య దేవనాథన్‌ తెలిపారు. మరోవైపు యూజర్ల పెరుగుదల, కీలక మార్కెట్లలో యువతలో ఫేస్‌బుక్‌కు ఆదరణ తగ్గుతోందన్న అభిప్రాయాన్ని ఆమె సున్నితంగా తోసిపుచ్చారు. మెటాలో భాగమైన ఫేస్‌బుక్‌కు భారత్‌లో 40 కోట్ల మందిపైగా వినియోగదారులున్నట్లు ఆమె వివరించారు. భారత్‌లో తాము నవకల్పనలను పరీక్షించి, ఇంటర్నేషనల్ మార్కెట్లో విడుదల చేస్తున్నట్లు చెప్పారు. 2030లోగా దాదాపు లక్ష కోట్ల డాలర్ల డిజిటల్‌ ఎకానమీగా ఎదగాలన్న భారత లక్ష్యం, డిజిటల్ వ్యాపారాలకు గణనీయమైన ఊతమిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.