Sensex: మోర్గాన్ స్టాన్లీ అంచనా.. వచ్చే ఏడాది సెన్సెక్స్ 1,05,000 పాయింట్లకు చేరే అవకాశాలు!
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ వచ్చే ఏడాది చివరికి 1,05,000 పాయింట్ల స్థాయికి చేరే అవకాశాలు ఉన్నట్లు మోర్గాన్ స్టాన్లీ నివేదిక పేర్కొంది. అయితే అది సాధ్యం కాకపోతే కనీసం 93,000 పాయింట్ల స్థాయిలో సెన్సెక్స్ నిలవొచ్చని స్పష్టం చేసింది. మోర్గాన్ స్టాన్లీ అంచనా ప్రకారం, అనుకోని పరిణామాలు లేదా ప్రతికూల పరిస్థితుల కారణంగా సెన్సెక్స్ 70,000 పాయింట్లు దిగువకు పడిపోయే అవకాశముందని తెలిపింది. సెన్సెక్స్ పెరుగుదలకు కార్పొరేట్ ఆదాయ వృద్ధి, ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం, దేశీయంగా ఈక్విటీ పెట్టుబడుల పెరుగుదల వంటి అంశాలు అనుకూలంగా ఉంటాయని నివేదిక పేర్కొంది. ఈ ఏడాది సెప్టెంబరు చివరి వారం నుంచి విదేశీ సంస్థాగత మదుపరులు (ఎఫ్‌ఐఐలు) 6-7శాతం మేర అమ్మకాలు చేశారు.
వచ్చే ఏడాది సరైన కంపెనీలను ఎంపిక చేసుకోవాలి
దీని ఫలితంగా మార్కెట్లు గరిష్ఠ స్థాయిల నుంచి పతనమయ్యాయి. అయినప్పటికీ భారతదేశం ఒక ఆకర్షణీయ మార్కెట్ అని మోర్గాన్ స్టాన్లీ అభిప్రాయపడింది. వచ్చే ఏడాది మదుపరులు సరైన కంపెనీల ఎంపిక ద్వారా పెట్టుబడులను పెంచితే, మంచి లాభాలు ఆర్జించగలుగుతారని నివేదిక సూచించింది. సైక్లికల్ సెక్టార్స్, ఆర్థిక సేవలు, పారిశ్రామిక రంగం, టెక్నాలజీ రంగాలు పెరుగుదలలో ముందంజ వహించగలిగే అవకాశాలున్నాయని వివరించింది. ప్రపంచవ్యాప్తంగా అమెరికా, జపాన్, భారతదేశం అనేది ప్రస్తుతం ఆకర్షణీయ మార్కెట్లుగా ఉన్నాయని, ఐరోపాలో మాత్రం కొంత అప్రమత్తత అవసరమని మోర్గాన్ స్టాన్లీ సూచించింది.