
Elon Musk: రూ.927కోట్ల షేర్లను దాతృత్వ సంస్థలకు విరాళంగా ఇచ్చిన మస్క్
ఈ వార్తాకథనం ఏంటి
టెస్లా,స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. 108 మిలియన్ డాలర్లకు పైగా విలువైన టెస్లా షేర్లను కొన్ని ఛారిటీ సంస్థలకు విరాళంగా అందించారు. ఈ వివరాలను టెస్లా కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. మస్క్‌కు టెస్లాలో 12.8 శాతం వాటాలు ఉండగా, ఈ వాటాలో నుంచి 2,68,000 షేర్లను ఆయన కొత్త సంవత్సరానికి ముందు విరాళంగా ఇచ్చారు. వీటి మొత్తం విలువ 108.2 మిలియన్ డాలర్లు, అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.927 కోట్లు. ఈ షేర్లను మస్క్ పన్ను ప్రణాళికలో భాగంగా బదిలీ చేసినట్లు కంపెనీ పేర్కొంది. అయితే, ఈ విరాళం అందుకున్న ఛారిటీ సంస్థల వివరాలను వెల్లడించలేదు.
వివరాలు
408.3 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన వ్యక్తి
ఎలాన్ మస్క్ తన టెస్లా షేర్లను విరాళంగా ఇవ్వడం ఇది మొదటిసారి కాదు. 2022 నుండి మస్క్ ఈ విధానాన్ని కొనసాగిస్తున్నారు. అంతకుముందు, 2021లో ఆయన తన లాభాపేక్షేతర సంస్థ మస్క్ ఫౌండేషన్‌కు 5.74 బిలియన్ డాలర్ల విరాళం అందజేశారు. ఈ ఫౌండేషన్ మానవాళికి ప్రయోజనం చేకూర్చే భద్రమైన కృత్రిమ మేధపై పనిచేస్తోంది. ప్రస్తుతం మస్క్ 408.3 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా కొనసాగుతున్నారు.