Elon Musk: ఓపెన్‌ఏఐ దావాలోకి టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ పేరు చేర్చిన మస్క్
ఎలాన్ మస్క్ ఓపెన్‌ఏఐను స్థాపించిన సమయంలో చేసిన ఒప్పందాలను ఉల్లంఘించారంటూ, ఆ సంస్థ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్‌పై మరోసారి దావా వేశారు. ఈసారి మైక్రోసాఫ్ట్‌ను కూడా ఈ వివాదంలోకి లాగడం గమనార్హం. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఈ చర్య ఏఐ మార్కెట్లో గుత్తాధిపత్యం సాధించడంపై ఎలాన్ మస్క్ అసహనాన్ని ప్రతిబింబిస్తోంది. 2015లో ఎలాన్ మస్క్, శామ్ ఆల్ట్‌మన్ కలిసి ఓపెన్‌ఏఐని ప్రారంభించారు. ఆ సంస్థలో ప్రారంభంలో పెట్టుబడులు పెట్టిన మస్క్ 2018లో కంపెనీ నుంచి తప్పుకున్నారు. ఇక 2019లో మైక్రోసాఫ్ట్ 14 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఓపెన్‌ఏఐలో కీలక భాగస్వామిగా మారింది. మైక్రోసాఫ్ట్, ఓపెన్‌ఏఐ మధ్య ఒప్పందాల ద్వారా ఏఐ మార్కెట్లో పోటీని అణచివేయాలని ప్రయత్నిస్తున్నారని మస్క్ ఆరోపణలు చేశారు.
6 బిలియన్ డాలర్లు సమకూర్చా : మస్క్
ఇతర సంస్థలకు నిధులు అందడం కష్టమవుతోందని, దీని ప్రభావం తన సొంత ఏఐ సంస్థ ఎక్స్‌ఏఐ పైనా పడుతోందని వెల్లడించారు. 2023 అక్టోబర్‌లో ఓపెన్‌ఏఐ 6.6 బిలియన్ డాలర్ల నిధులు సమీకరించింది. తాను మాత్రం మార్చిలో తన సంస్థకు 6 బిలియన్ డాలర్లను స్వయంగా సమకూర్చుకున్నానని మస్క్ స్పష్టం చేశారు. 2022 నవంబరులో చాట్‌జీపీటీ లాంచ్ అయిన తర్వాత, ఓపెన్‌ఏఐ ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఆదరణ పొందింది. ఈ టెక్నాలజీని గుత్తాధిపత్యంగా మార్చడంలో ఓపెన్‌ఏఐ, మైక్రోసాఫ్ట్ కీలక పాత్ర పోషిస్తున్నాయని మస్క్ అభిప్రాయం వ్యక్తం చేశారు.