
Anil Ambani: అనిల్ అంబానీకి మరో ఎదురుదెబ్బ.. ఈడీ కొత్త కేసు
ఈ వార్తాకథనం ఏంటి
రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నుండి రూ.2,929.05 కోట్ల రుణ మోసంపై సంబంధించి, రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (ఆర్‌కామ్) డైరెక్టర్‌గా ఉన్న అనిల్ అంబానీపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) మరో కొత్త కేసును నమోదు చేసింది. ఈ కేసులో అనిల్ అంబానీతోపాటు, పలు గుర్తుతెలియని ప్రభుత్వ అధికారులు,ఇతర వ్యక్తులపై కూడా చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ చర్యలు గత నెలలో సీబీఐ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా తీసుకున్నట్టు సమాచారం.
వివరాలు
రిలయన్స్ ఇన్‌ఫ్రాటెల్ ద్వారా ఆర్‌కామ్ బిల్లులను తక్కువగా చూపించారు
ఎస్‌బీఐ కంప్లైంట్ ప్రకారం, రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (ఆర్‌కామ్) అనేక బ్యాంకుల నుండి రూ.40,000 కోట్లకు పైగా రుణాలు తీసుకున్నా, వాటిని చెల్లించలేదు. 2018 గణాంకాల ప్రకారం,ఎస్‌బీఐ ఒక్కటే రూ.2,929 కోట్లు నష్టాన్ని భరించింది. సీబీఐ అధికార ప్రతినిధుల ప్రకారం, "నేరపూరిత కుట్రలో నిందితులు పాల్గొన్నారు. ఆర్‌కామ్‌కు అనుకూలంగా రుణాలను పొందేందుకు ఎస్‌బీఐని తప్పుదారి పట్టించారు. ఆ రుణాలను దుర్వినియోగం చేసి వివిధ అవకతవకలకు పాల్పడ్డారు. రిలయన్స్ ఇన్‌ఫ్రాటెల్ ద్వారా ఆర్‌కామ్ బిల్లులను తక్కువగా చూపించడం, అమ్మకాల ఇన్‌వాయిస్లను ఉపయోగించి రుణాల దుర్వినియోగం చేయడం వంటి చర్యలు జరిగాయి" అని వివరించారు.
వివరాలు
'సీ విండ్' ఇంట్లోనూ సోదాలు
ఈ నేపథ్యంలో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నష్టాలకు అనిల్ అంబానీ కారణమని సీబీఐ ఇటీవల ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. దర్యాప్తు సంస్థ అతని ముంబైలోని ఇంట్లో, ఆర్‌కామ్ కార్యాలయం,'సీ విండ్' నివాసంలో సోదాలు నిర్వహించింది. నేరపూరిత కుట్ర, మోసం, నమ్మకద్రోహం వంటి నేరాలకు పాల్పడినందుకు అంబానీ, ఆర్‌కామ్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది.