
Stock market: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు .. మళ్లీ 25 వేల ఎగువకు నిఫ్టీ
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ముగిశాయి. ఉదయం అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాల కారణంగా సూచీలు నష్టాల్లో ప్రారంభమైనప్పటికీ, తర్వాత IT స్టాక్స్ మద్దతు ఇచ్చి సూచీలను లాభాల్లోకి మళ్ళించాయి. ముఖ్యంగా ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా,హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్లు సూచీలను ముందుకు నడిపించాయి. ఈ ప్రభావంతో నిఫ్టీ మళ్లీ నెల రోజుల తరువాత 25,000మార్కును మించిన స్థాయికి చేరింది. సెన్సెక్స్ ఉదయం 81,671.47 పాయింట్ల వద్ద ప్రారంభమైంది(మునుపటి ముగింపు 81,644.39). ప్రారంభంలో కొన్ని నిమిషాల పాటు సూచీలు నష్టాల్లో ఉండగా,తరువాత క్రమంగా పుంజుకొని లాభాల్లోకి వెళ్లాయి. ఇంట్రాడేలో 81,985.62 పాయింట్ల వద్ద గరిష్ట స్థాయిని తాకిన సెన్సెక్స్ చివరికి 213.45 పాయింట్ల లాభంతో 81,857.84 వద్ద స్థిరపడింది.
వివరాలు
బ్రెంట్ క్రూడ్ 66.16 డాలర్లు
నిఫ్టీ 69.90 పాయింట్ల లాభంతో 25,050.55 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 87.06 వద్ద నిలిచింది. సెన్సెక్స్‌లోని 30 సూచీలలో ఇన్ఫోసిస్, టీసీఎస్, హిందుస్థాన్ యూనిలీవర్, ఎన్టీపీసీ, టాటా స్టీల్ ప్రధానంగా లాభపడ్డాయి. మరోవైపు, బీఈఎల్, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, ట్రెంట్, ఐటీసీ షేర్లు నష్టాలు చవిచూశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో, బ్రెంట్ క్రూడ్ 66.16 డాలర్ల వద్ద స్థిరంగా కొనసాగుతోంది, అలాగే బంగారం ఔన్సు 3,326.05 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.