
Stock Market : నష్టాల బాట పట్టిన దేశీయ స్టాక్ మార్కెట్లు సూచీలు
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్లపై టారిఫ్ భయాలు పెనుముప్పుగా మారాయి. సుంకాలపై ఎటువంటి వాణిజ్య చర్చలు జరగబోవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు పెట్టుబడిదారుల భావోద్వేగాలను దెబ్బతీశాయి. అంతర్జాతీయ పరిణామాల ప్రభావం కూడా మార్కెట్ సెంటిమెంట్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. ఫలితంగా శుక్రవారం (ఆగస్టు 8) ట్రేడింగ్ సెషన్‌లో సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా నష్టాల్లో కదులుతుండగా, నిఫ్టీ 24,600 పాయింట్ల స్థాయిని కోల్పోయింది. ఉదయం 9.30 గంటల సమయానికి సెన్సెక్స్ 305.11 పాయింట్లు క్షీణించి 80,318.15 వద్ద కొనసాగింది. నిఫ్టీ 79.2 పాయింట్ల నష్టంతో 24,516.95 వద్ద ట్రేడ్ అవుతోంది. విదేశీ కరెన్సీ మార్కెట్లో రూపాయి,అమెరికా డాలర్‌తో పోలిస్తే 2 పైసలు పడిపోయి 87.60 వద్ద ఉంది.
వివరాలు
మిశ్రమంగా ముగిసిన అమెరికా మార్కెట్లు
నిఫ్టీ సూచీలో ట్రెంట్, బజాజ్ ఫైనాన్స్, ఎన్టీపీసీ, హీరో మోటార్స్, టైటాన్ కంపెనీ షేర్లు లాభాల్లో రాణిస్తున్నాయి. మరోవైపు భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హిందాల్కో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఆసియా-పసిఫిక్ మార్కెట్లు శుక్రవారం మిశ్రమ ధోరణిని ప్రదర్శిస్తున్నాయి. జపాన్ నిక్కీ సూచీ 2 శాతం మేర లాభాల్లో కొనసాగుతుండగా, హాంకాంగ్ హాంగ్‌సెంగ్ 0.76 శాతం, దక్షిణ కొరియా కోస్పి 0.13 శాతం, ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్ సూచీ 0.29 శాతం మేర నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అమెరికా మార్కెట్లు గురువారం మిశ్రమంగా ముగిశాయి. డౌ జోన్స్ 0.5 శాతం, ఎస్‌అండ్‌పీ 500 సూచీ 0.1 శాతం నష్టపోగా, నాస్‌డాక్ మాత్రం 0.3 శాతం లాభాన్ని సాధించింది.