NPS Vatsalya: ఏడాదికి ₹10,000 పెట్టుబడితో మీ బిడ్డకు రిటైర్మెంట్ నాటికి ₹11 కోట్లు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ప్రకటించిన ఎన్‌పీఎస్ వాత్సల్య (NPS Vatsalya) పథకం ప్రారంభమైంది. ఈ పథకం దీర్ఘకాలిక పెట్టుబడులు చేసుకోవాలనుకునే వారి కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. ముఖ్యంగా తమ పిల్లల భవిష్యత్తును ఆర్థికంగా భద్రంగా చేయాలనుకునే తల్లిదండ్రులకు ఇది ఎంతో ఉపయోగకరం. ఈ పథకం ద్వారా ప్రజలు పొదుపు అలవాట్లను పెంపొందించుకోవడం సాధ్యమవుతుంది. మరి ఈ పథకం ఏమిటి? ఎవరు అర్హులు? ఎంత పెట్టుబడితో ఎంత లాభం పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
అర్హతలు
ఎన్‌పీఎస్ వాత్సల్య పథకం కింద 18 ఏళ్లలోపు పిల్లల పేరుతో తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఖాతా తెరవవచ్చు. పిల్లలు మేజర్లు అయిన తర్వాత, ఈ ఖాతా సాధారణ ఎన్‌పీఎస్ టైర్-1 ఖాతాగా మారుతుంది. ఈ ఖాతా తెరవడానికి కనీసంగా రూ. 1,000 మదుపు చేయవచ్చు, కానీ గరిష్ఠ పరిమితి లేదు. ఈ పథకం, దేశ పౌరులను దీర్ఘకాలిక ఆర్థిక భద్రత కోసం ప్రోత్సహించడమే లక్ష్యంగా రూపొందించబడింది.
రాబడులు
ఎన్‌పీఎస్ పెట్టుబడులు మంచి రాబడులను అందిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇప్పటికే 1.86 కోట్ల మంది ఎన్‌పీఎస్‌లో చేరినట్లు ఆమె ప్రకటించారు. పథకంలో 10 సంవత్సరాల క్రితమే పెట్టుబడి పెట్టిన వారికి వివిధ పథకాల్లో 8.8% నుంచి 14% మధ్య రాబడులు లభించాయి. పీఐబీ చండీగఢ్ 'ఎక్స్'లో పేర్కొన్న సమాచారం ప్రకారం, 18 ఏళ్ల పాటు రూ.10 వేలు చొప్పున మదుపు చేస్తే, 10% రాబడితో 5 లక్షల వరకు సంపాదించవచ్చు. అదే 60 ఏళ్లు వచ్చేసరికి 12.86% రాబడితో రూ. 11.05 కోట్లు పొందవచ్చు.
ఖాతా తెరవడం ఎలా?
ఎన్‌పీఎస్ వాత్సల్య ఖాతాను బ్యాంక్ లేదా పోస్టాఫీసులో ప్రారంభించవచ్చు.ఆన్‌లైన్ ద్వారా eNPS వెబ్‌సైట్‌లో కూడా ఖాతా ప్రారంభించడానికి సదుపాయం ఉంది.పాన్ నంబర్,మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడీ వంటి వివరాలను ఇచ్చి పద్ధతిగా ఖాతా తెరవవచ్చు. ఎన్‌పీఎస్‌తో ప్రయోజనాలు 18 ఏళ్లలోపు పిల్లల పేరుతో ఎన్‌పీఎస్ ఖాతా తీసుకోవచ్చు. కనీసంగా రూ.1,000 మదుపు చేయవచ్చు. 60 ఏళ్ల తరువాత రిటైర్మెంట్ సమయంలో పింఛను అందుతుంది. విద్య, అనారోగ్య వంటి అవసరాల కోసం ముందస్తుగా ఉపసంహరణ చేసుకునే అవకాశం ఉంది. మూడేళ్ల లాక్-ఇన్ పీరియడ్ తర్వాత 25% వరకు మూడు సార్లు ఉపసంహరించుకోవచ్చు. చక్రవడ్డీ ప్రయోజనం లభిస్తుంది. మార్కెట్ రిస్క్‌ను బట్టి LC-75, LC-50, LC-25 వంటి ఎంపికలు ఉంటాయి.
18 ఏళ్ల తర్వాత..?
ఎన్‌పీఎస్ వాత్సల్య పథకంలో చేరిన వారు 18 ఏళ్లకు చేరుకున్న తర్వాత పథకం నుంచి బయటకు రావచ్చు. ఆ సమయానికి ఖాతాలో ఉన్న మొత్తం రూ.2.5 లక్షలలోపు ఉంటే, మొత్తం మొత్తాన్ని ఉపసంహరించుకోవడం సాధ్యమవుతుంది. అయితే, మొత్తం రూ.2.5 లక్షలకు మించితే, అందులో 80% ని యాన్యుటీ పథకంలో పెట్టడం అవసరం. మిగతా 20% మొత్తాన్ని ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. 18 ఏళ్ల తర్వాత కూడా ఖాతాను కొనసాగించాలనుకుంటే, ఆ అవకాశం ఉంది. కానీ, 18 ఏళ్లు పూర్తి అయిన మూడు నెలల్లోపు కేవైసీని పూర్తి చేయడం తప్పనిసరి. అప్పటి నుండి ఈ ఖాతా సాధారణ టైప్-1 ఖాతాగా మారుతుంది, దానిపై సాధారణ ఎన్‌పీఎస్ ఖాతాకు వర్తించే నియమాలు వర్తిస్తాయి.