Page Loader
NVIDIA: $1T నుండి $4T వరకు.. 2 సంవత్సరాలలో నివిడియా రికార్డు విలువను తాకింది
$1T నుండి $4T వరకు.. 2 సంవత్సరాలలో నివిడియా రికార్డు విలువను తాకింది

NVIDIA: $1T నుండి $4T వరకు.. 2 సంవత్సరాలలో నివిడియా రికార్డు విలువను తాకింది

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 10, 2025
10:26 am

ఈ వార్తాకథనం ఏంటి

కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో విస్తృతంగా ఆధిపత్యం చెలాయిస్తున్న నివిడియా కార్పొరేషన్, ప్రపంచ మార్కెట్‌లో మరో చరిత్రాత్మక ఘట్టాన్ని అందుకుంది. బుధవారం ట్రేడింగ్ సెషన్‌లో కంపెనీ షేరు ధర 164 డాలర్లను అధిగమించడంతో,మొత్తం మార్కెట్ విలువ 4 ట్రిలియన్ డాలర్లను (అంటే సుమారుగా రూ.342 లక్షల కోట్లు)దాటింది. ఇలా పబ్లిక్ ట్రేడింగ్‌లో ఉన్న సంస్థలలో ఈ ఘనతను పొందిన మొదటి కంపెనీగా నిలిచింది. ఈ భారీ వాల్యుయేషన్‌తో ఎన్విడియా,మైక్రోసాఫ్ట్ (3.75 ట్రిలియన్ డాలర్లు),ఆపిల్ (3.19 ట్రిలియన్ డాలర్లు) వంటి టెక్ దిగ్గజాలను వెనక్కినెట్టి,ప్రపంచంలో అత్యధిక విలువ కలిగిన కంపెనీగా అవతరించింది.

వివరాలు 

ఏఐ విప్లవానికి వెన్నెముకగా ఎన్విడియా 

గత సంవత్సరం జూన్‌లో మొదటిసారి ట్రిలియన్ డాలర్ క్లబ్‌లోకి అడుగుపెట్టిన ఎన్విడియా, కేవలం ఒక్క సంవత్సరంలోనే తన మార్కెట్ విలువను మూడు రెట్లు పెంచుకుంది. ఇప్పటికే 3 ట్రిలియన్ మార్క్‌ను చేరుకున్న ఈ చిప్ తయారీ దిగ్గజం,ఇప్పుడు 4 ట్రిలియన్ డాలర్ల మైలురాయిని సైతం దాటి టాప్ స్థాయికి చేరింది. గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్స్ (GPUలు) తయారీలో ఎన్విడియా తీసుకువచ్చిన ఆధునికత,కృత్రిమ మేధా వ్యవస్థలకు ప్రధాన మద్దతుగా నిలిచింది. జనరేటివ్ ఏఐ మోడల్స్,స్వయంచాలక వాహనాల నుంచి డీప్ లెర్నింగ్ ఫ్రేమ్‌వర్క్‌ల వరకు, ఎన్విడియా తయారు చేసిన చిప్‌లను అనేక రంగాలు ఉపయోగిస్తున్నాయి. 2025కి సంబంధించి మొదటి త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 70%పెరిగి 44బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇది మార్కెట్ విశ్లేషకుల అంచనాలను మించిపోయింది.

వివరాలు 

ప్రపంచ మార్కెట్లపై ఎన్విడియా ప్రభావం 

ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్ మాట్లాడుతూ, యాక్సిలరేటెడ్ కంప్యూటింగ్, జనరేటివ్ ఏఐకు గల డిమాండ్ అనూహ్యంగా పెరుగుతుండటం వల్ల, ప్రస్తుతం మేము కొత్త పారిశ్రామిక విప్లవాన్ని చూస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ఎన్విడియా, అమెరికాలోని ప్రముఖ స్టాక్ ఇండెక్స్ అయిన S&P 500లో 7.3 శాతం వాటాను కలిగి ఉంది. ఇది గత టెక్నాలజీ దిగ్గజాలను మించిపోయింది. కంపెనీ అద్భుత వృద్ధి పెట్టుబడిదారుల పోర్ట్‌ఫోలియోలను, టెక్ రంగంలో ఉన్న వ్యూహాలను పూర్తిగా తిరగరాసేలా చేసింది. సరఫరా పరిమితులు, అంతర్జాతీయ పోటీ వంటి సవాళ్లు ఉన్నప్పటికీ, ఎన్విడియాకు గల అభివృద్ధి స్థిరంగా,గ్లోబల్ స్థాయిలో ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

వివరాలు 

ఇండియన్‌ బడ్డెట్‌కు 10 రెట్లు 

ఎన్విడియా 4 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువను పొందడం అంటే భారత రూపాయల్లో దాదాపు రూ.342.66 లక్షల కోట్లకు సమానం. భారతదేశంలో అగ్రగామిగా ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్ వంటి సంస్థల మార్కెట్ విలువను కలిపినా ఇది మించిపోతుంది. ఇక కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌తో పోలిస్తే, ఎన్విడియా మార్కెట్ విలువ దాదాపు 10 రెట్లు ఎక్కువగా ఉంది. ఇది ఈ సంస్థ గ్లోబల్ మార్కెట్‌లో ఎంత ప్రభావశీలంగా మారిందో స్పష్టంగా తెలియజేస్తోంది.