Ola Electric : భారీగా నిధులు సేకరించిన ఓలా..రూ.3,000కోట్లు సమీకరించిన ఈవీ సంస్థ
ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్ కంపెనీ ఓలా వ్యాపార విస్తరణ కోసం భారీగా నిధులన సేకరించింది. ఈ మేరకు గిగాఫ్యాక్టరీ నిర్మాణానికి కావాల్సిన నిధుల్లో భాగంగా రూ.3 వేల కోట్లను సమీకరించినట్లు ఓలా ఎలక్ట్రిక్ ప్రకటించింది. టెమాసెక్ నేతృత్వంలోని ఇన్వెస్టర్లతో పాటు బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నుంచి రూ.3,000 కోట్లు సమీకరించామని ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) గురువారం తెలిపింది. దీంతో నిధుల సేకరణ ప్రక్రియ పూర్తయిందని పేర్కొంది. సేకరించిన నిధులను కంపెనీ ఎలక్ట్రిక్ వాహన రంగంలో వ్యాపారాన్ని మరింత విస్తృతం చేసేందుకు వినియోగించనున్నట్లు వివరించింది. ఇదే సమయంలో తమిళనాడులోని కృష్ణగిరిలో లిథియం ఐయాన్ సెల్ (Lithium-Ion Cell) తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేసింది.
భారతదేశం, ఈవీ ప్రయాణంలోనే గిగాఫ్యాక్టరీ గొప్ప మైలురాయి : ఓలా సీఈఓ
ఈవీ రంగంలో ఓలా ఎలక్ట్రిక్ తన ఆటో మార్కెట్ ను క్రమంగా విస్తరిస్తోంది. సమీప భవిష్యత్ లో మోటార్ సైకిళ్లతో పాటు కార్లను తయారు చేసే ఆలోచన ఉందని వివరించింది. ఇందు కోసం భారీగా గిగా ఫ్యాక్టరీని నిర్మిస్తున్నట్లు తెలిపింది. మరోవైపు సెల్ తయారు చేసే సంస్థలకు ఇస్తున్న ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహకాలకు (PLI) ఓలా ఎలక్ట్రిక్ ను ప్రభుత్వం ఎంపిక చేసింది. వాహన రంగంలో సంప్రదాయ ఇంధన వాహనాల (ICE) స్థానంలో EVలతో భర్తీ చేయడమే లక్ష్యమని కంపెనీ సీఈఓ భవీష్ అగర్వాల్ వెల్లడించారు. భారతదేశం, ఈవీ ప్రయాణంలోనే గిగాఫ్యాక్టరీ గొప్ప మైలురాయిగా అవతరించనుందని ఆయన తెలిపారు. ఈవీ రంగంలో సాంకేతికతలు, బ్యాటరీలను తయారు చేయాలనే లక్ష్యానికి కట్టుబడి ఉన్నామన్నారు.