
Ap grameena vikas bank: గ్రామీణ బ్యాంకులు విలీనం.. 1 నుంచి ఏపీలో గ్రామీణ వికాస్ బ్యాంక్ ఒక్కటే
ఈ వార్తాకథనం ఏంటి
ఒకే దేశం - ఒకే గ్రామీణ బ్యాంక్ ప్రణాళిక త్వరలో అమల్లోకి రానుంది. దేశవ్యాప్తంగా గ్రామీణ బ్యాంకింగ్ వ్యవస్థను సమర్థవంతంగా రూపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 11 రాష్ట్రాల్లో పనిచేస్తున్న 15 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను ఏకీకరించి, దేశవ్యాప్తంగా ఉన్న 43 గ్రామీణ బ్యాంకుల సంఖ్యను 28కి తగ్గించనున్నట్లు తెలిపింది. మే 1వ తేదీ నుంచి ఈ నూతన వ్యవస్థ అమల్లోకి రానుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్ పేర్కొంది.
వివరాలు
ఏ రాష్ట్రంలో ఎంత?
ఆ గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4 బ్యాంకులు, ఉత్తర్‌ప్రదేశ్,పశ్చిమ బెంగాల్‌లో చెరో 3, బిహార్, గుజరాత్, జమ్మూ & కశ్మీర్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్ రాష్ట్రాల్లో చెరో 2 బ్యాంకులు ఉన్నాయి. ఇకపై ఒక్కో రాష్ట్రంలో ఒకే గ్రామీణ బ్యాంక్ మాత్రమే పనిచేస్తుంది. ప్రజల సంక్షేమం, బ్యాంకింగ్ వ్యవస్థ బలోపేతం దృష్ట్యా, రీజినల్ రూరల్ బ్యాంక్స్ యాక్ట్ - 1976 ప్రకారం ఈ ఏకీకరణ చేపడుతున్నట్లు ఆర్థిక శాఖ తెలిపింది.
వివరాలు
గ్రామీణ వికాస్ బ్యాంక్ ఒక్కటే
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్, సప్తగిరి గ్రామీణ బ్యాంక్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ అనే నాలుగు వేర్వేరు బ్యాంకులు ఉన్నాయి. వీటికి యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పాన్సర్డ్ బ్యాంకులుగా ఉన్నాయి. అయితే, ఏకీకరణ అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఒకే గ్రామీణ బ్యాంక్‌గా "ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్" పేరుతో పని చేస్తుంది. దీని ప్రధాన కార్యాలయం అమరావతిలో ఉండే అవకాశం ఉంది. యూనియన్ బ్యాంక్ దీనికి స్పాన్సర్డ్ బ్యాంక్‌గా వ్యవహరించనుంది. ఇదే విధంగా ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కూడా ఒక్కో ఆర్‌ఆర్‌బీగా వ్యవస్థీకరించనున్నారు.
వివరాలు
196 నుంచి 43కు
సంబంధిత బ్యాంకింగ్ చరిత్రలోకి వెళితే, దేశంలో ఒకప్పుడు మొత్తం 196 గ్రామీణ బ్యాంకులు ఉండేవి. 2004-05 నుంచి 2020-21 మధ్య మూడు విడతలుగా జరిగిన ఏకీకరణ ప్రక్రియ ఫలితంగా వాటి సంఖ్య 43కి తగ్గింది. ప్రస్తుతం చేపడుతున్న నాల్గో దశ ఏకీకరణ ద్వారా ఈ సంఖ్యను 28కి తగ్గించనున్నారు. ఈ గ్రామీణ బ్యాంకులు ప్రధానంగా చిన్న, మధ్య తరహా రైతులు, వ్యవసాయ కార్మికులు, చిన్న పరిశ్రమలు, చేతి వృత్తులవారికి రుణాలు అందించేందుకు ఏర్పడ్డవే. RRB యాక్ట్ 1976 కింద స్థాపించబడ్డ ఈ బ్యాంకుల్లో కేంద్ర ప్రభుత్వం 50 శాతం వాటా కలిగి ఉండగా, ప్రాయోజిత బ్యాంక్ 35 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 15 శాతం వాటాలను కలిగి ఉంటాయి.