AI Threat to Humanity: ఏఐతో మానవాళికి ముప్పు.. గూగుల్, మెటా సహా టెక్ దిగ్గజాలపై కోర్టులో పిటిషన్
ఈ వార్తాకథనం ఏంటి
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్ దిగ్గజాలకు న్యాయపరమైన సవాళ్లు ఎదురవుతున్నాయి. ఏఐ సాంకేతికత మానవాళి మనుగడకే ముప్పుగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ పలు లాభాపేక్షలేని సంస్థలు కోర్టును ఆశ్రయించాయి. అత్యంత శక్తిమంతమైన ఏఐ మోడళ్ల అభివృద్ధిని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశాయి. చాట్‌జీపీటీ, జెమినీ, క్లాడ్ వంటి ఏఐ ఉత్పత్తుల తదుపరి అభివృద్ధిని అడ్డుకోవాలని కోరుతూ శాన్‌ఫ్రాన్సిస్కో కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశాయి. గూగుల్, మెటా, ఓపెన్ఏఐ, ఆంత్రోపిక్ వంటి సంస్థల ఏఐ అభివృద్ధిపై ఈ పిటిషన్ ప్రభావం చూపే అవకాశం ఉంది.
వివరాలు
కంపెనీల అధినేతల హెచ్చరికలే ఆధారాలు
ఇర్రిప్లేసబుల్ ఎడ్యుకేషన్ ఫండ్, పబ్లిక్ సిటిజన్, హీట్ ఇనిషియేటివ్ సంస్థలు కలిసి ఈ పిటిషన్ దాఖలు చేశాయి.
కాలిఫోర్నియాలోని అన్యాయమైన వ్యాపార పద్ధతులకు సంబంధించిన చట్టాలను ఆధారంగా చేసుకుని ఈ దావా వేశాయి.
ఈ వ్యాజ్యంలో ఏఐ సంస్థల అధినేతలు గతంలో చేసిన వ్యాఖ్యలను కూడా ఆధారాలుగా ప్రస్తావించడం గమనార్హం.
ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోదీ, స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ గతంలో ఏఐ వల్ల మానవ నాగరికత నాశనమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించిన విషయాన్ని పిటిషనర్లు గుర్తుచేశారు.
అంతేకాకుండా కొన్ని ఏఐ మోడళ్లు పరీక్షల దశ నుంచి బయటపడి, ప్రభుత్వ వెబ్‌సైట్లపై స్వతంత్రంగా దాడులు చేసిన ఘటనలను కూడా తమ వాదనల్లో ప్రస్తావించారు.
వివరాలు
ఏఐ భద్రతపై రాష్ట్రాల న్యాయపోరాటం
మరోవైపు ఏఐ భద్రతకు సంబంధించి ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా న్యాయపోరాటం చేస్తున్నాయి.
గత జూన్‌లో ఫ్లోరిడా అటార్నీ జనరల్ జేమ్స్ ఉత్మీయర్ ఓపెన్ఏఐపై కేసు దాఖలు చేశారు.
చాట్‌జీపీటీ ద్వారా పిల్లలకు హానికరమైన సమాచారం అందుతోందని ఆయన ఆరోపించారు.
పాఠశాలల్లో కాల్పులకు పాల్పడే వారికి అవసరమైన సమాచారం అందించడం, ఆత్మహత్యలకు ప్రేరేపించే సూచనలు ఇవ్వడం వంటి తీవ్రమైన ఆరోపణలు చేశారు.
ఈ ఆరోపణలపై ఓపెన్ఏఐ స్పందిస్తూ.. తమ శక్తిమంతమైన ఏఐ మోడళ్ల శిక్షణను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిపింది.
మరిన్ని భద్రతా చర్యలు, ప్రమాణాలు ఏర్పాటు చేసిన తర్వాతే వాటి అభివృద్ధిని కొనసాగిస్తామని వెల్లడించింది.
వివరాలు
ఓపెన్ఏఐపై మరో 8 రాష్ట్రాల కేసులు
ఇదిలా ఉండగా.. గత నెలలో మరో ఎనిమిది రాష్ట్రాలు కలిసి ఓపెన్ఏఐపై దేశవ్యాప్తంగా వేర్వేరు కోర్టుల్లో కేసులు దాఖలు చేశాయి.
మానవ విలువలకు కట్టుబడి ఉంటాయనే హామీ ఇవ్వకుండా, స్వయంగా అభివృద్ధి చెందగల ఏఐ మోడళ్లను రూపొందించకూడదని ఆయా రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి.
మరోవైపు చైనాతో పోటీని దృష్టిలో పెట్టుకుని ట్రంప్ ప్రభుత్వం ఏఐ రంగంపై కఠినమైన నిబంధనలు విధించేందుకు ఆసక్తి చూపడం లేదు.
ఈ నేపథ్యంలో ఏఐ భద్రతపై పెరుగుతున్న న్యాయపోరాటాలు టెక్ పరిశ్రమలో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.