Page Loader
Madhabi puri Buch: సెబీ చీఫ్‌కు త్వరలోనే పార్లమెంటరీ ప్యానల్‌ సమన్లు..?
సెబీ చీఫ్‌కు త్వరలోనే పార్లమెంటరీ ప్యానల్‌ సమన్లు..?

Madhabi puri Buch: సెబీ చీఫ్‌కు త్వరలోనే పార్లమెంటరీ ప్యానల్‌ సమన్లు..?

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 06, 2024
12:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

మార్కెట్ నియంత్రణాధికార సంస్థ సెబీ (SEBI) ఛైర్‌పర్సన్ మాధవి పురి బచ్‌ ప్రస్తుతం కొత్త సమస్యల్లో చిక్కుకున్నారు. ఆమె అధిపతిగా ఉన్నప్పటి నుండి, సెబీ కార్యాలయంలో పని విధానంపై సిబ్బంది చేసిన ఫిర్యాదులు ఒక పెద్ద వివాదానికి దారితీశాయి. ఈ అంశంపై పార్లమెంటరీ కమిటీ సమీక్ష చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కేసీ వేణుగోపాల్‌ నేతృత్వంలోని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఆమెకు సమన్లు జారీ చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నారని వార్తలు అందుతున్నాయి.

వివరాలు 

ఉద్యోగులు రాసిన లేఖ పలు అంశాలు

సెబీ బాస్ చుట్టూ గతంలో అనేక వివాదాలు చుట్టుకున్నాయి. ముఖ్యంగా,అదానీ గ్రూప్‌తో సంబంధం ఉన్న ఆరోపణల తరువాత, ఐసీఐసీఐ బ్యాంక్ నుండి వేతనం పొందడం వంటి అంశాలపై ఆమె మరింత చర్చకు వచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల,సెబీలో పనితీరుపై ఉద్యోగులు రాసిన లేఖ పలు అంశాలను వెలుగులోకి తెచ్చింది.లేఖలో, మాధవి సెబీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత,సంస్థ పని విధానం పూర్తిగా మారిపోయిందని,భారీ లక్ష్యాలు నిర్ణయించడం,సాధించలేకపోతే అవమానించడం సాధారణంగా మారిపోయిందని పేర్కొన్నారు. దీనిపై సెబీ 'బయటి వ్యక్తుల పనే' అని వివరణ ఇచ్చింది.దీనితో వివాదం మరింత తీవ్రతరం అయింది. దీనికి సంబంధించి,సెబీ ప్రధాన కార్యాలయం వద్ద సెబీ ఉద్యోగులు గురువారం నిరసన తెలిపారు. మాధవి పురి బచ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

వివరాలు 

సెప్టెంబర్ 10న పీఏసీ సమావేశం

ప్రభుత్వ ఖాతాలు, ప్రభుత్వ సంస్థల పనితీరుపై నిఘా ఉంచడం పబ్లిక్ అకౌంట్ కమిటీ (PAC) బాధ్యత. సెప్టెంబర్ 10న పీఏసీ తదుపరి సమావేశం జరగనుంది, అదే రోజున సెబీ ఛైర్‌పర్సన్‌ను పిలిచే అవకాశం ఉంది. అలాగే, జల్ శక్తి మంత్రిత్వ శాఖ కాగ్ (CAG) రిపోర్ట్‌పై కూడా చర్చలు జరగనున్నట్లు సమాచారం.