Madhabi Puri Buch: పార్లమెంటరీ కమిటీ సమావేశానికి సెబీ చీఫ్ గైర్హాజరు..
సెబీ చీఫ్ మాధబి పురీ బచ్ పార్లమెంటరీ కమిటీ సమావేశానికి హాజరుకాలేకపోయారు. దేశంలోని నియంత్రణ సంస్థల పనితీరును సమీక్షించడానికి పార్లమెంటరీ కమిటీ (PAC) ఆమెకు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ సమావేశం అక్టోబర్ 24న జరగాల్సి ఉండగా, కొన్ని ముఖ్యమైన కారణాల వలన ఆమె హాజరుకాలేనని కమిటీకి తెలియజేశారు. ఈ నేపథ్యంలో, రివ్యూ కమిటీ సమావేశం వాయిదా పడినట్లు తెలుస్తోంది.
బచ్‌కు PAC రెండో సారి సమన్లు
సెబీ చీఫ్ గైర్హాజరు విషయమై కమిటీకి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ స్పందిస్తూ, ''మొదటి సమావేశంలోనే రెగ్యులేటరీ పనితీరుపై సమీక్ష చేపట్టాలని నిర్ణయించాం. సంబంధిత వ్యక్తులకు సమన్లు పంపించాం, కానీ వారు హాజరుకాలేనని తెలిపారు. అయినా, మేం దాన్ని తిరస్కరించాం. తరువాత, తాను తన బృందంతో సమావేశానికి హాజరవుతామని పేర్కొన్నారు. కానీ ఈ రోజు ఉదయం 9:30 గంటలకు, ఆమె దిల్లీకి రావడం సాధ్యపడడం లేదని మాకు సమాచారం అందింది. దాంతో, ఆమె అభ్యర్థనను పరిగణనలోకి తీసుకొని సమావేశాన్ని వాయిదా వేశాం,'' అని చెప్పారు. బచ్‌కు PAC సమన్లు పంపడం ఇది రెండో సారి.